https://oktelugu.com/

Gali Janardhan Reddy: ఆ భయంతోనే బిజెపిలోకి గాలి జనార్దన్ రెడ్డి

2023 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముంగిట జనార్దన్ రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు. హరపనహళ్లి, బళ్లారి సిటీ నుంచి బిజెపి టికెట్లపై పోటీ చేసిన తన ఇద్దరు సోదరులు

Written By:
  • Dharma
  • , Updated On : March 25, 2024 3:20 pm

    Gali Janardhan Reddy joins BJP

    Follow us on

    Gali Janardhan Reddy: సార్వత్రిక ఎన్నికల ముంగిట కీలక పరిణామం. బిజెపితో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మనసు మార్చుకున్నారు. తిరిగి బిజెపి గూటికి చేరారు. తనకు చెందిన కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీని బిజెపిలో విలీనం చేశారు. సోమవారం మాజీ సీఎం యడ్యూరప్ప, బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బివై విజయేంద్ర సమక్షంలో పార్టీని విలీనం చేశారు. బిజెపి కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముంగిట బిజెపితో విభేదించిన గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని పెట్టుకున్నారు. కానీ బిజెపి హై కమాండ్ లైట్ తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో ఓట్లు చీల్చిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ బిజెపి ఓటమికి కారణమైంది.

    2023 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముంగిట జనార్దన్ రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు. హరపనహళ్లి, బళ్లారి సిటీ నుంచి బిజెపి టికెట్లపై పోటీ చేసిన తన ఇద్దరు సోదరులు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డిల ఓటమిలో జనార్ధన రెడ్డి కీలక పాత్ర పోషించారు. బళ్లారి సిటీలో తన సోదరుడు సోమశేఖర్ రెడ్డి పై భార్య అరుణ లక్ష్మిని బరిలో దింపారు. దీంతో ఓట్ల చీలిక జరిగి అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి విజయం సాధించారు. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి జనార్దన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ పరిణామాలను గమనించిన బిజెపి హై కమాండ్ కర్ణాటకలో ఒంటరి పోరు శ్రేయస్కరం కాదని భావించింది. అందుకే దేవెగౌడ నేతృత్వంలోని జెడిఎస్ పార్టీతో సీట్లను సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన పార్టీని విలీనం చేసుకుంది.

    యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో జనార్ధన రెడ్డి మంత్రిగా ఉన్నారు. కర్ణాటకలో బిజెపి బలోపేతం కావడంలో జనార్దన్ రెడ్డి పాత్ర ఉంది. కొన్ని విషయాల్లో పార్టీతో విభేదించి ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం దూరమైంది. మూడు నాలుగు జిల్లాల్లో జనార్ధన రెడ్డికి మంచి పట్టు ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికలు బిజెపికి కీలకము కావడంతో కొద్దిరోజుల కిందట అమిత్ షా జనార్దన్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీ విలీనంపై చర్చించారు. అయితే తాను బే షరతుగానే బిజెపిలో చేరానని.. మూడోసారి మోదీని ప్రధాని చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తాను రాజ్యసభ పదవి ఆశించి బిజెపిలో చేరలేదని కూడా చెప్పుకొచ్చారు.మొత్తానికైతే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో ఓటమి భయంతోనే గాలి జనార్ధన రెడ్డిని బిజెపిలో చేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.