Ambati Rambabu: గిట్టని వాళ్లు ఆయనను సంబరాల రాంబాబు అంటారు. దగ్గరి వాళ్ళు సంతోషాల రాంబాబు అంటారు. ఎవరు ఏమనుకున్నా ఆయన పట్టించుకోరు. విమర్శలు వస్తున్నా వినిపించుకోరు.. సంక్రాంతి సంబరాల్లో ఆడతారు, పాడతారు. భోగి మంటలు మండుతుంటే.. డీజే పాటలు పెట్టుకుని స్టెప్పులు వేస్తుంటారు. గిట్టని మీడియా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. అనుకూల మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. అయినప్పటికీ అంబటి రాంబాబు లెక్కపెట్టరు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆయన డ్యాన్స్ చేసిన వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లోనూ ఆయన ఇదే తీరుగా స్టెప్పులు వేశారు. అప్పట్లో ఆయన చేసిన హడావిడిని.. ఓ సినిమాలో ఓ కమెడియన్ పాత్రధారితో స్పూఫ్ గా చేయించినట్టు ఆరోపణలు వినిపించాయి.. దానిపై అంబటి రాంబాబు కూడా స్పందించారు. ఆ చిత్ర నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హోలీ పండుగ సందర్భంగా సోమవారం దేశ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ప్రజలందరూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో నిర్వహించిన వేడుకల్లోనూ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. పాల్గొనడం అంటే ఏదో చుట్టపుచూపుగా కాదు.. తను మంత్రిననే హోదాను మర్చిపోయారు. కళ్ళకు కళ్ళజోడు, ప్రత్యేకమైన టీ షర్టు వేసుకొని సందడి చేశారు. చేతిలో ఒక కర్ర పట్టుకొని వేలాడుతున్న ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నించారు. చుట్టూ ఆడవాళ్లు డ్యాన్సులు చేస్తుండగా.. ఒకరు ఉట్టిని కిందికి, మీదకు లాగుతుండగా.. చేతిలో కర్రతో ఆ ఉట్టిని అంబటి రాంబాబు కొట్టారు. అయితే ఎంత కొట్టినా ఆ ఉట్టి పగలలేదు. అనంతరం అక్కడి ప్రజలు రంగురంగుల నీళ్లు అంబటి రాంబాబు పై చల్లారు. అనంతరం రాంబాబు వారితో కలిసి స్టెప్పులు వేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.” ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా స్టెప్పులు వేస్తారు. ఆ వేడుకలను ఘనంగా జరుపుతారు. మొదటిదాకా అంబటి రాంబాబు అనేవారు. సంక్రాంతి వేడుకల తర్వాత సంబరాల రాంబాబు అయిపోయారు. అయితే తన ఉత్సాహాన్ని సంక్రాంతి వరకే పరిమితం చేయలేదు. ఎన్నికలో, మరో కారణమో తెలియదు గాని.. అంబటి రాంబాబు హోలీ పండుగ నాడు రంగుల రాంబాబు అయిపోయారు. ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. ఉట్టి కొట్టారు.. బాగుందంటూ” ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు హోలీ సంబరాలు pic.twitter.com/8OKFIUIX3b
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2024