https://oktelugu.com/

Gaddar- Bhadrachalam: యాదగిరి నరసన్న కంటే ముందే.. రామయ్య ఎదుట గద్దర్ ప్రణమిల్లాడు

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని గద్దర్‌ 2006 సెప్టెంబరు 23న దర్శించారు. ఒక సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎవరూ ఊహించని రీతిలో భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 7, 2023 / 12:11 PM IST

    Gaddar- Bhadrachalam

    Follow us on

    Gaddar- Bhadrachalam: గద్దర్.. తన ఆహార్యాన్ని మర్చుకున్నాడు. ఎర్రజెండా భుజాన పట్టుకుని తిరిగేవాడు.. నుదుటన మూడు నామాలు దిద్దుకున్నాడు. దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని ఆచరించినవాడు.. భగవంతుడి ముందు మోకరిల్లాడు. విప్లవాన్ని నమ్మినవాడు.. చివరికి దేవుడే దిక్కు అనే అంగీకారానికి వచ్చాడు. వాస్తవానికి చాలామంది గద్దర్ యాదాద్రి నరసన్న దర్శనానికి వెళ్ళినప్పుడే పూర్తిగా మారిపోయాడు అనుకుంటున్నారు. కానీ 17 సంవత్సరాల క్రితమే గద్దర్ భద్రాద్రి రామయ్య సేవలో తరించాడు. మూడు నామాలు నుదుటిమీద దిద్దుకుని.. నెత్తిన పూజారులతో శటారి పెట్టించుకున్నాడు.

    మన్యం వాసుల కష్టాలపై కలంతో గళం విప్పి పాలక ప్రభుత్వాలను నిలదీసిన పోరాట యోధుడు గద్దర్. ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనుల సమస్యలపై నిరంతరం తన బాణిలో పోరాటం సాగించాడు. పోలవరం వల్ల ఆదివాసీల బతుకులు ఛిద్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన వారికి బాసటగా నిలిచారు. అంతేకాదు ప్రకృతి అందాలను, గోదారమ్మను ఎంతగానో ప్రేమించే ప్రజా యుద్ద నౌక, ఆదివాసీల పక్షపాతి గద్దర్‌. తన పాటతో గోదారమ్మ తీరును ఎంతో అందంగా గానం చేసి యావత్‌ తెలుగువారిని రంజింపజేశారు.

    మన్యం పోరాట యోధుడిగా ..

    మన్యం పోరాట యోధుడిగా గద్దర్‌ పలుమార్లు భద్రాచలం ఏజెన్సీకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సమయంలో ఆయన పలుమార్లు భద్రాచలం ఏజెన్సీ సరిహద్దుల్లో కి వచ్చారు. 1/70 చట్టం గురించి, గిరిజనుల సమస్యలపై తనదైన శైలిలో గళం విప్పి పాలక ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా ఖనిజ సంపద దోపిడీ తదితర వాటిపై ప్రభుత్వాల తీరును ప్రశ్నించారు. గద్దర్‌ ఆదివాసుల బతుకులు ఏ విధంగా నాశనమవుతాయో తనదైన శైలిలో పాటల రూపంలో పాడి వారి దుస్థితిని కన్నులకు కట్టినట్లు వివరించారు.

    Gaddar- Bhadrachalam

    భక్తరామదాసు విప్లవకారుడే..

    భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని గద్దర్‌ 2006 సెప్టెంబరు 23న దర్శించారు. ఒక సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎవరూ ఊహించని రీతిలో భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గద్దర్‌ను విలేకరులు మీరు దేవున్ని విశ్వసించరు కదా విప్లవ భావాలు కలిగిన మీరు ఆలయాన్ని సందర్శించ డానికి కారణం అడగగా, రామాలయ నిర్మాణాన్ని చేపట్టిన భక్తరామదాసుగా ప్రసిద్దిగాంచిన కంచర్ల గోపన్న సైతం విప్లవకారుడేనని ఆనాడు గుర్తు చేశారు. తన జైలు జీవితం అనుభవించిన సమయంలో తన బాధను వ్యక్తం చేస్తూ ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా అంటూ ప్రశ్నించారని, భక్తరామదాసుది ప్రశ్నించే తత్వమేనని అందుకే తాను సైతం భద్రాద్రి రామాలయాన్ని సందర్శించినట్లు నాడు గద్దర్‌ పేర్కొన్నారు.

    గోదారమ్మపై పాట ఆలపించి..

    2006 సెప్టెంబరు 23న భద్రాచలం వచ్చిన సమయంలో అభయాంజనేయస్వామి పార్కులో గోదారమ్మపై తనదైన శైలిలో పాటపాడి అక్కడ ఉన్న వారిని గద్దర్‌ మంత్రముగ్దుల్ని చేశారు. “అమ్మా గోదావరి నీకు వందనమమ్మా ” అంటూ ఆనాడు గద్దర్‌..” గంగమ్మ గంగమ్మా కోల్‌.. ఘనమైన గంగా కోల్‌.. నాసిక్‌లో పుట్టి నడకా నేర్చింది.. భద్రాద్రిలో సీతమ్మ దగ్గరకు వచ్చి కాళ్లు కడిగావా గోదావరి.. తల్లీ కోల్‌.. గోవుపాలు తల్లీ కోల్‌ .. దక్షిణ గంగమ్మా దయగల గంగమ్మ” అంటూ తనదైన శైలిలో గోదావరి, పాపికొండల అందాల మీద పాటపాడి నాడు మంత్రముగ్దుల్ని చేశారు.

    చివరగా 2011 మార్చి 30న భద్రాద్రి రాక

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా 2011 మార్చి 30న భద్రాచలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో
    తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ సభలో ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రజాప్రంట్‌ అధ్యక్షుడిగా గద్దర్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో పోలవరం నిర్మాణం ఆగాలంటే తెలంగాణ రావాలని పేర్కొన్నారు. పోలవరానికి, గోదావరికి తెలంగాణకు గిరిజనులకు సంబంధం ఉందని గిరిజన ప్రాంతంలోని ఖనిజ సంపదను దోచుకుపోయేందుకు తునికాకుపై మాత్రమే ఆదివాసీలకు హక్కు ఉండేలా చూసి మిగిలిన వాటిని కార్పోరేట్లపరం చేసే కుట్ర సాగుతోందని ఆరోపించారు. అడవిలో ఉండే విష పురుగులు, ఆదివాసీలు శత్రువులు కారని కాంట్రాక్టర్లు, అటవీ పోలీసు అధికారులు నడిపించే పాలక ప్రభుత్వాలే ఆదివాసీలకు శత్రువని ఆనాడు స్పష్టం చేశారు.