
రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఆయన భవితవ్యం డోలాయమానంలో పడింది. అసైన్డ్ భూ కబ్జాలో ప్రమేయం ఉన్నట్లుగా తేల్చి ఆయనను పదవికి, పార్టీకి దూరం చేయాలనే యోచనలో అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజకీయ హైడ్రామా చోటుచేసుకుంది. అయితే ఈటల రాజేందర్ పై వేటు వేయాలా వద్దా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈటలకు సానుభూతి పవనాలు పెరిగిన సందర్భంలో ఆయనపై వేటు వేస్తే పార్టీకే ప్రధాన నష్టం జరుగుతుందనే ఆలోచనలో పార్టీ వర్గాలు చెబుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రాజకీయ చదరంగంలో ఈటలపై గులాబీ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
పక్కా ప్రణాళికతోనే..
ఈటల రాజేందర్ పక్కా ప్రణాళికతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన దగ్గరకు జిల్లా, ప్రాంతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఏదైనా జరిగితే మేం మీ వెంటే ఉంటామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈటల సైతం బలమైన నిర్ణయంతోనే పార్టీపై పోరు చేయాలనే తలంపుతో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఈటలపై చుట్టూ ఉచ్చు బిగించినట్లు భావిస్తున్నారు. మొత్తానికి రాజకీయంలో శాశ్వత మిత్రులుండరు శాశ్వత శత్రువులు ఉండరని సామెత. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ రాజకీయ ఎత్తుగడపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
డీఎస్ మాదిరిగానే..
గతంలో టీఆర్ఎస్ అధిష్టానం డి.శ్రీనివాస్ పై వేటు వేయాలని భావించినా ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో డీఎస్ కోవలోనే ఈటల రాజేందర్ పై సైతం చర్యలుంటాయో ఉండవో అనే మీమాంస అందరిలో నెలకొంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈటల రాజేందర్ పై వేటు తప్పదనే వాదన సైతం వినిపిస్తోంది. ఈటల రాజేందర్ భవితవ్యంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో ఉండేది లేదని తేల్చినట్లు చెబుతున్నారు. బహిష్కరణకే ప్రాధాన్యమిచ్చి పార్టీని వీడనున్నట్లు సమాచారం.
మొదటి నుంచి ధిక్కారమే..
గతంలో నుంచి పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్నారు ఈటల. పార్టీ నిర్మాణంలో తమదే ప్రధాన పాత్ర పదేపదే చెబుతూ కేసీఆర్ పై బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో పార్టీ ఎలాగైనా ఈటలను పక్కకు పెట్టాలనే పాచికలో భాగంగానే భూ కబ్జాల వ్యవహారం బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పార్టీ భవితవ్యం సైతం డోలాయమానంలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.