
Dahi Controversy Tamil Nadu: తమ రాష్ట్ర ఉనికిని ప్రశ్నించే ఏ అంశాన్నీ తమిళులు సహించరు..ఉద్యమిస్తారు..సంఘటితంగా పోరాడుతారు. సాధించేదాక వదలరు. జల్లుకట్టు ఉద్యమమే ఇందుకు ప్రధాన ఉదాహరణ. జల్లుకట్టుపై కేంద్ర ప్రభుత్వం నిషేధించే క్రమంలో తమిళులు తిరగబడ్డారు. ప్రజాస్వామ్యయూతంగా నిరసన తెలిపారు. మెరీనా బీచ్ తీరానికి లక్షలాదిగా చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరసన గళమెత్తారు. తమిళులు చేసిన రీ సౌండ్ సెగ నాడు మోదీ సర్కారుకు తగిలింది. జల్లికట్టుపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. తాజాగా పెరుగు ప్యాకెట్లపై హిందీ భాష వాడాలన్న భారత ఆహార భద్రతా, ప్రమాణాల ప్రాధికార సంస్థ సూచనపై పెద్ద ఉద్యమానికే సన్నద్ధమయ్యారు. తమిళనాడులో విక్రయించే పెరుగు ప్యాకెట్లలో ఇంగ్లిష్‌లో కర్డ్ అని.. తమిళంలో తయిర్ అని ఉంటుంది. ఆ రెండింటినీ తీసేసి దహీ అనే పదం వాడాలని ఆదేశాలిచ్చింది. పెరుగును హిందీలో దహీ అంటారు. ఇలా ఆదేశాలు బయటకు వచ్చిన మరుక్షణం తమిళనాడు భగ్గుమంది. అన్ని రాజకీయ పక్షాలు బయటకు వచ్చాయి. చివరకు బీజేపీ రాష్ట్ర శాఖ సైతం వారితో మాట కలపాల్సి వచ్చింది.
మాతృభాష ప్రేమికులు..
తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర లేదు. మాతృభాషను తప్ప మరో భాషను తమిళులు ఒప్పుకోరు. ప్రధానంగా హిందీ పదం కనిపిస్తే చాలూ వారు పునకం వచ్చిన వారిలా ఊగిపోతారు. భాష విషయంలో తర,తమ,వర్గ, రాజకీయ ప్రయోజనం ఉండదు. భాష పరిరక్షణకు ముందుకొచ్చి పోరాటం చేయడంలో తమిళులు ముందుంటారు. అయితే ఇది ఇప్పటిది కాదు. స్వాతంత్రానికి ముందు నుంచే వారిలో భాషపై అభిమానం కొనసాగుతూ వస్తోంది. తమిళనాడులో హిందీ భాష ప్రాముఖ్యత పెంచాలన్న కేంద్ర ప్రభుత్వాల ప్రయత్నాలేవీ ఇంతవరకూ సక్సెస్ కాలేదు. ఇలా ప్రయత్నించిన ప్రతిసారి ప్రతిఘటనలు తప్పడం లేదు. ఇప్పుడు ఈ దహీ
ఉద్యమంలో అన్ని రాజకీయ పక్షాలు భాగస్వామ్యం కావడం విశేషం.
కేంద్రానికి గట్టి హెచ్చరికలు..
ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం హిందీని తమపై రుద్దవద్దని పలుసార్లు చెప్పింది. అయినా కేంద్రం వదలడం లేదు. తాజాగా మరోసారి హిందీ భాష గొడవ మొదలైంది. హిందీని వ్యతిరేకిస్తూ మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి స్టాలినే హెచ్చిరించేదాక పరిస్థితి వచ్చింది. నందిని పెరుగు ప్యాకెట్.. దీనిపై తమిళం లేదు. హిందీ భాషలో దహీ అని ఉంది..హిందీలో దహీ అంటే పెరుగు అని అర్థం..ఇదే తమిళనాట రచ్చరచ్చ అవుతోంది. పెరుగు ప్యాకెట్లపై దహీ ఉండొద్దని.. దీన్ని ఎంతమాత్రం సహించమంటున్నారు సీఎం స్టాలిన్. ఇది దక్షాణాది రాష్ట్రాలపై కేంద్ర దండయాత్రగా అభివర్ణించారు. పెరుగు ప్యాకెట్లపై తమిళ పదం ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేశారు. దక్షిణాది నుంచి హిందీని బహిష్కరించేలా పెద్ద ఉద్యమమే చేపట్టనున్నట్టు చెప్పారు. ఇదే విషయంపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధించారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలపై కేంద్ర సంస్థల జోక్యం తగదన్నారు. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

వెనక్కి తగ్గిన మోడీ సర్కారు..
అయితే ఈ ఉద్యమ సెగలు కేంద్రానికి తాకినట్టు ఉన్నాయి. అందుకే వెంటనే ఎఫ్‌ఎస్‌ఏఏఐ ఉపశమన చర్యలు చేపట్టింది. నిర్ణయంపై వెనక్కి తగ్గింది. పెరుగు ప్యాకెట్లతో ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాషల పేర్లు పెట్టుకోవచ్చని సూచించింది. ఉత్తర్వులు సవరిస్తూ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఘటనతో తమిళనాడు జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఆ రాష్ట్రం , అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజలు చూపుతున్న చొరవ మిగతా రాష్ట్రాల్లో లేకుండాపోతుందన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది. దాదాపు అవే ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వచ్చుంటాయి. కానీ తమిళుల నుంచే రియాక్షన్ వచ్చింది. మాతృభాషపై ఎనలేని మమకారం కనిపించింది. కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం కనీసం స్పందించేవారు లేకపోవడం విచారకరం.