Coromandel Express Accident: మెయిన్ లైన్ లో నుంచి లూప్ లోకి.. కోరమాండల్ ప్రమాదంలో ఎన్నో అనుమానాలు

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ప్రమాదం జరిగేందుకు కొద్దిసేపటి ముందు ఆన్లైన్లో మరమ్మతులు జరిగాయి. అది కూడా సిగ్నల్ పాయింట్ వద్ద పనులు చేశారు.

Written By: K.R, Updated On : June 5, 2023 1:05 pm

Coromandel Express Accident

Follow us on

Coromandel Express Accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పిన నేపథ్యంలో.. జరిగిన ప్రమాదం రైల్వే శాఖను ఒక కుదుపు కుదుపుతోంది. ఈ ప్రమాదం వల్ల వందలాది మంది చనిపోయారు. 1000కి మించి ప్రయాణికులు క్షతగాత్రులు అయ్యారు. రైల్వే శాఖ మంత్రి ఇందులో కుట్ర కోణం ఉందని చెబుతున్నారు. ఆయన ఆరోపణలకు బలం చేకూర్చుతూ రైల్వే శాఖ అధికారులు సాంకేతిక పరమైన లోపాలను తెరమీదకి తీసుకొస్తున్నారు. ఇంతకీ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పిన ప్రమాదంలో మిస్టరీ ఎందుకు ఏర్పడింది? ఈ ఘటనలో అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి?

అనుమానాలు

డ్రైవర్ తప్పిదం లేదు. సిగ్నల్ సరిగానే ఉంది. అయినప్పటికీ మెయిన్ లైన్ లో భద్రంగా వెళ్లాల్సిన రైలు లూప్ లైన్ లోకి వెళ్ళింది. గూడ్స్ రైలును ఢీ కొట్టింది. మరి అన్ని బాగుంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది. పాయింట్ మిషన్ సెట్టింగ్ మార్చడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ మంత్రి అంటున్నారు. పాయింట్ పుష్ ఫెయిల్యూర్ కూడా జరిగి ఉండవచ్చు అనే అనుమానం కూడా వ్యక్తవుతోంది. అసలు శుక్రవారం బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద ఏం జరిగి ఉండవచ్చు? ఆ వివరాలు ఏమిటో ఈ కథనంలో మనం చూద్దాం. బహనాగ్ రైల్వే స్టేషన్ లో నాలుగు లైన్లు ఉన్నాయి. ఉన్నవి రెండు మెయిన్ లైన్లు. అటూఇటూ ఉన్నవి లూప్ లైన్లు. మెయిన్ లైన్ లో రైలు వెళుతున్నప్పుడు స్టేషన్ మాస్టర్ గదిలోని ప్యానెల్ బోర్డులో గ్రీన్ కలర్ చూపిస్తోంది. రైలు పాయింట్ దాటి వెళ్లిపోగానే అక్కడ రెడ్ లైన్ వస్తుంది. ఒకానొక దశలో ఎడమవైపు ఎల్ సి అంటే లెవెల్ క్రాసింగ్ 95 వద్ద గ్రీన్ సిగ్నల్ ఉంది. కుడి వైపున ఉన్న ఈ ఎల్ సి మాత్రం రెడ్ సిగ్నల్ చూపిస్తోంది. ఇదే అసలు మిస్టరీకి కారణమవుతోంది. వాస్తవానికి రెండు ఎల్సీలు ఒకే సిగ్నల్ చూపించాలి. కుడివైపు ఎల్ సి రెడ్ సిగ్నల్ ఉండడమే కాకుండా.. పక్కనే ఉన్న పాయింట్ ఆఫ్ లైన్ నుంచి డౌన్ లైన్ కు కనెక్ట్ అయింది. వేగంపరంగా చూస్తే కూడా ఇలా జరగకూడదు.

ఎక్కడో తేడా జరిగింది

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ప్రమాదం జరిగేందుకు కొద్దిసేపటి ముందు ఆన్లైన్లో మరమ్మతులు జరిగాయి. అది కూడా సిగ్నల్ పాయింట్ వద్ద పనులు చేశారు. అంటే అవి సరిగా చేశారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గూడ్స్ రైలును మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ లోకి మార్చిన తర్వాత కోరమాండల్ కు లైన్ క్లియర్ చేశారు. ప్యానెల్ బోర్డులో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ బాగానే ఉంది. కానీ ఫిజికల్ గా క్రాసింగ్ పాయింట్ దగ్గర అలా లేదు. దాంతో అక్కడి నుంచి కోరమాండల్ లూప్ లైన్ లోకి వెళ్ళిపోయింది. జరగడానికి రెండు కారణాలు ఉంటాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మెయిన్ లైన్ త్రూ అయినట్టు గ్రీన్ సిగ్నల్ వచ్చినా లూప్ లైన్ లో రివర్స్ (రెడ్ రాకపోవడం) అవ్వకపోవడం సాంకేతికంగా ఒక లోపం.

పాయింట్ పుష్ ఎందుకు చేయలేదు?

గూడ్స్ రైలులో లూప్ లైన్లోకి పంపించిన తర్వాత.. మెయిన్ లైన్ లోకి వెళ్లేలా పాయింట్ పుష్ (ట్రాక్ మార్చడం) చేయాలి. మెయిన్ లైన్ లో కోరమాండల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, పాయింట్ పుష్ మోటర్ ఆపరేట్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఎక్స్ప్రెస్ రైలు వచ్చేలోగా ఎవరైనా లెవెల్ క్రాసింగ్ వద్ద రివర్స్ క్రాస్ చేసి ఉంటారా? అనే సందేహం తలెత్తుతోంది. సంబంధిత సెట్టింగ్స్ ఎవరో మార్చారని రైల్వే మంత్రి సైతం ఇదే మాట చెప్పారు. అయితే ఎవరో కావాలని సెట్టింగ్స్ మార్చడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక దశలో ఒక వ్యక్తి చేయగలిగే పని కూడా కాదని వారు పేర్కొంటున్నారు. ఆ సెక్షన్లో పనిచేసే వారికి మాత్రమే దీని గురించి అవగాహన ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇంటర్ లాకింగ్ గురించి కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థలో ఇంటర్ లాకింగ్ అనేది అంతర్భాగం. స్టేషన్ మాస్టర్ తన గదిలో నుంచే కంప్యూటర్ సహాయంతో రైళ్ల పట్టాలను మార్చవచ్చు. ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైలు ఉండకుండా చూస్తూ వచ్చే, పోయే రైళ్లకు పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థ ఇది. ఇది రైలు ప్రయాణించాల్సిన మార్గం పూర్తిగా సురక్షితం అని తేలే వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆపుతుంది. మరోవైపు రైల్వే సిగ్నలింగ్ లోకి అత్యాధునిక సాంకేతిక విధానాలను అనుసరిస్తున్నారు. ఇందులో ఫెయిల్ సేఫ్ సిస్టం కూడా ఒకటి. అంటే ఒకచోట సిగ్నల్ విఫలమైతే ఆటోమేటిగ్గా ఇతర అన్ని ట్రాక్ లలో సిగ్నల్ రెడ్ అని వస్తుంది. ఫలితంగా అన్ని రైళ్ళూ ఆగిపోతాయి. దీని ద్వారా ప్రమాదాన్ని నివారించగలుగుతారు. మరి కోరమాండల్ విషయంలో ఫెయిల్ సేఫ్ టెక్నాలజీ ఎందుకు పనిచేయలేదనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.