Nitish Kumar- KCR: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇప్పటి సోషల్ మీడియా యుగంలో అయితే శాశ్వత ప్రెస్ మీట్ శత్రువులు, శాశ్వత ప్రెస్ మీట్ మిత్రులు ఉండరు అని మార్చుకోవాలేమో.. ఎందుకంటే ఆ మధ్య బీహార్లో రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్నులను చెక్కుల రూపంలో అందించేందుకు, తన సొంత పార్టీ ప్రచారానికి కెసిఆర్ వెళ్ళాడు.. నేను వస్తున్నా అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కబురు పంపాడు. ఆయన కూడా నాదేం పోయిందని రండి రండి అన్నాడు. చెక్కులు ఇచ్చారు. ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కానీ కెసిఆర్ మాటలు ఎందుకో తేడా అనిపించి నితీష్ వెంటనే లేచాడు. కెసిఆర్ బలవంతంగా కూర్చోబెట్టాడు. తర్వాత సీన్ నితీష్ కు అర్థమైంది.

ఢిల్లీ వైపు అడుగులు
భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు అయ్యాక రాష్ట్రీయ జనతా దళ్ తో నితీష్ జట్టు కట్టాడు. ఆ తేజస్వీ యాదవ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాడు.. కానీ దీని వెనుక పెద్ద స్కెచ్ ఉంది.. ఇప్పటితోనే కాకుండా 2025లో నూ ఎన్నికల సారధ్యాన్ని తేజస్వి యాదవ్ కు ఇచ్చి తాను ఢిల్లీ వెళ్లాలి అనేది నితీష్ కుమార్ ఆలోచన.. ఇది బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశంలో అగ్గి రేపుతా అనే కెసిఆర్ కు మింగుడు పడని పరిణామం. ఈరోజు పార్టీ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న వేళ ఆయనకు షాక్ లాంటి వార్త. ఆమధ్య గులాబీ మీడియా కేసీఆర్ నాయకత్వాన్ని నితీష్ కుమార్ సమర్థించారు అని రాసుకుంటూ వచ్చింది. కానీ ప్రస్తుత పరిణామంతో దానికి దెబ్బకు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది.
ప్రతి అడుగులోనూ
ప్రధాని పీఠం ఎక్కాలనే ఆకాంక్ష నితీష్ కుమార్ ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. రేసులో నేను లేనని ఆయన చెబుతున్నప్పటికీ… ఎత్తుగడలు మాత్రం హస్తిన దిశగానే సాగుతున్నాయి.. ప్రధాని పదవిపై మక్కువ పెంచుకున్న వారిలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రథమ స్థానంలో ఉండగా… నితీష్ కుమార్, శరత్ పవార్, కెసిఆర్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా పోటీ పడుతున్నారు.. వీరిలో నితీష్ మాత్రమే లోతుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా వెలుగుతున్నారు.. అంతేకాదు బిజెపితో తెగతెంపులు చేసుకొని ఆర్ జె డి, కాంగ్రెస్, వామపక్షాల కూటమితో కలిసి మహా కూటమి సారధిగా ఆయన బీహార్ రాష్ట్రాన్ని ఏలుతున్నారు.. అంతేకాదు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో మంతనాలు జరిపి ఒకప్పటి రాజకీయ శత్రువు అయిన ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో తిరిగి సయోధ్య కుదరచడం వెనుక పూర్తి రాజకీయ కోణమే కనిపిస్తోంది.. అంతేకాదు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకు రాగల సామర్థ్యం ఆయనకు ఉంది..

ప్రధాని రేసులో ఉన్నారు
ప్రధాని పదవికి తాను పోటీదారుల్లో లేనని నితీష్ పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ… ఈ మాటలోనే ఆయన రాజకీయం కనిపిస్తోంది.. సొంత పార్టీ నేతలను కాకుండా తేజస్వి యాదవ్ ను తన వారసుడిగా ప్రకటించడం ద్వారా ఆయన రెండు లక్ష్యాలు సాధించగలిగారు. మొదటిది ఆర్జెడి నేతలను ప్రసన్నం చేసుకొని లోక్ సభ ఎన్నికల్లో జేడియు- ఆర్జెడి పొత్తును కొనసాగించడం.. ప్రధాని పదవికి ఆర్జేడి మద్దతు పొందడం.. అయితే గోవాలో, ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీని మింగేసిన మమతా బెనర్జీ పై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. పవార్ కు టర్మ్స్ బాగోలేవు. కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ దెబ్బ కొడుతున్నాడు. ఇలాంటి తరుణంలో దేశంలో తానే పెద్ద పార్టీ కాబట్టి మిగతా విపక్షాలు తననే బలపరచాలనేది కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశమని, అయితే రాహుల్ ను తమ సారధిగా అంగీకరించేందుకు ఎవరూ సుముఖంగా లేరని విశ్లేషకులు అంటున్నారు.. ఈ పరిస్థితుల్లో తన పేరును ప్రతిపాదిస్తుందని నితీష్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ జాబితాలో, ఈ రేసులో కెసిఆర్ ఎక్కడ ఉన్నారో టిఆర్ఎస్ పార్టీకే తెలియాలి. తెర వెనుక ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని అనడంలో అతిశయోక్తి కాక ఏమున్నది?!