
Foxconn : “స్వతంత్ర భారత చరిత్రలో ఇదో సువర్ణధ్యాయం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ రాష్ట్రం సాధించని విధంగా తెలంగాణ సాధించింది. ఏకంగా ఫాక్స్‌కాన్ అనే కంపెనీ మన రాష్ట్ర పారిశ్రామిక విధానాలు మెచ్చి తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతోంది తెలుసా? దీని వల్ల లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయి తెలుసా? ఇదంతా కేసీఆర్ దార్శనికతకు చిహ్నం. కేటీఆర్ అవిరళ కృషికి తార్కాణం”. ఇలా సాగిపోయింది నమస్తే తెలంగాణ రాసుకుంటూ పోయిన కథనం.
అసలు ఆ మధ్య ఇదే ఫాక్స్‌కాన్ గుజరాత్‌లో చిప్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్టు, భారీగా పెట్టుబడి పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. వేదాంత అనే గ్రూప్‌తో ఒప్పందం కూడా కుదర్చుకున్నట్టు అక్కడి బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఇంత వరకూ అక్కడ ఊదు కాలింది లేదు. పీరి లేచింది లేదు. మళ్లీ అదే ఫాక్స్ కాన్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. ఆ కంపెనీ అధిపతి జూనియర్ లియూను కేటీఆర్ సాదరంగా హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ప్రగతి భవన్‌కు తోడ్కోని వెళ్లారు. ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా… అసలు ఫ్యాక్స్ కాన్ మన రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది.
వాస్తవానికి ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఫాక్స్‌కాన్‌కు మధ్య ఒప్పందం కుదిరిందని, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌తో వచ్చే పదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని నమస్తే తెలంగాణ రాసింది. కానీ జూనియర్ లియూ మాత్రం పెట్టుబడులు, ఉపాఽధి అవకాశాల గురించి తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇది జరిగిన తర్వాత మరుసటి రోజు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సైతం ఫాక్స్‌కాన్ గురించి ప్రకటన చేశారు. కర్ణాటకలో భారీ పెట్టుబడులు పెట్టబోతోందని, లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. బొమ్మై ప్రకటనతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ యాపిల్ ఫోన్ల తయారీదారుగా ఉంది. తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో 2019 నుంచి యాపిల్ ఫోన్లు తయారు చేస్తోంది. తమ కొత్త ఐఫోన్-14ను త్వరలో భారత్‌లోనే తయారు చేయనున్నట్టు యాపిల్ కంపెనీ గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్ పెట్టబోయే ప్లాంట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజా పరిణామాలతో ఫాక్స్‌కాన్ శనివారం అధికారికంగా స్పందించింది. భారత్‌లో పె ట్టుబడులకు సంబంధించి తమ చైర్మన్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ సంస్థ పెట్టుబడులపై సందిగ్ధం నెలకొంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు రెండూ ఎన్నికల ముంగిటే ఉన్నాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటు చేస్తే భారీ సంఖ్యలో ఉద్యోగాలతో వస్తే అది రాజకీయంగానూ ప్రయోజనం చేకూరుతుందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే తొందరపడి ప్రకటనల చేశాయని తెలుస్తోంది. మరో వైపు అత్యధిక రాయితీలు రాబట్టడం కోసం ఫాక్స్‌కాన్ సంస్థే ఇరు రాష్ట్రాల మధ్య పోటీ పెడుతోందా? అనే అనుమానాలూ లేకపోలేదు.