
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పనులు ప్రారంభించిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నేల 16వ తేదీన విశాఖలో రాజధాని పనులకు శంకుస్థాపన చేయాలని సిఎం వై.ఎస్ జగన్ భావించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. న్యాయస్థానాల్లో కేసులు, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఇతర కారణాలతో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ఈ కార్యక్రమం వాయిదా పడుతుందని అందరూ భావించారు. ప్రభుత్వం కూడా అదే అంశాన్ని ప్రచారం చేసింది. గుట్టు చప్పుడు కాకుండా ఈ నెల 16వ తేదీన విశాఖలో ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఇది వెలుగులోకి రాలేదు. కేవలం కొందరు ముఖ్యమైన అధికారులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Also Read: పవన్ కళ్యాణ్ ది ‘రాజకీయ’ దీక్షేనా?
విశాఖ సమీపంలోని కాపులుప్పాడ ప్రాంతంలోని గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఆవరణలో ఉన్న కొండపై సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి 16వ తేదీన శంకుస్థాపన పూర్తి చేశారు. తాజాగా ఈ గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆకృతి (ఆర్కిటెక్చర్) రూపొందించేందుకు టెండర్లు పిలిచారు. ఈ పనులు పూర్తయిన అనంతరం టెండర్లు పిలువనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా తొమ్మిది నెలల వ్యవధిలో ఈ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధారించుకుని చర్యలు ప్రారంభించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఏపీ రాజధానిపై సుప్రీంలో కీలక పరిణామం.. వెనుక కథేంటి?
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన ప్రభుత్వం రాజధాని తరలింపుపై హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడంలో జాప్యం నెలకొనడంతో తొందరగా విచారించాలని లేఖ కూడా రాసింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ విచారణకు స్వీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కాపులుప్పాడలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణానికి అధికారులచేత స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించి, అనుకున్న ముహూర్తానికే కార్యనిర్వహక రాజధాని పనులకు శంకుస్థాపన పూర్తి చేసింది.