Homeజాతీయ వార్తలుManmohan Singh : ఆర్థిక సంస్కరణల మూల పురుషుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు..

Manmohan Singh : ఆర్థిక సంస్కరణల మూల పురుషుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు..

Manmohan Singh : మన్మోహన్ సింగ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత ఏడాది నుంచి ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆమధ్య ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. కొద్దిరోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. కోలుకుంటారని వైద్యులు ప్రకటించారు. అయితే మళ్లీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో మన్మోహన్ సింగ్ ఇబ్బంది పడక తప్పలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందించారు. అయితే వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన అవయవాలు సపోర్ట్ చేయడం మానేశాయి. దీంతో ఆయన కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పడంతో.. ఆ విషయాన్ని రాబర్ట్ వాద్రా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు . దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు.. కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ సమావేశం కోసం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కర్ణాటకలోని బెలగావిలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లిపోయారు. మన్మోహన్ సింగ్ కన్నుమూసిన నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
పీవీ నరసింహారావు తో..
మన్మోహన్ సింగ్ కు పీవీ నరసింహారావు తో విపరీతమైన సాన్నిహిత్యం ఉండేది.  పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు.. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. వీరిద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో.. నాడు పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ సింగ్ తన వంతు మద్దతు అందించారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. మనదేశంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోడీ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డును మన్మోహన్ సింగ్ సొంతం చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని చెక్వాల్ ప్రాంతంలో జన్మించారు.. ఉన్నత విద్యను అభ్యసించిన మన్మోహన్ సింగ్.. ఆర్థికపరమైన అంశాలపై విపరీతమైన పట్టును కలిగి ఉండేవారు. 33 సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్ పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. 1991లో పెద్దల సభకు ఎంపికయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి కాకముందుకు.. ఆర్థిక శాఖ సలహాదారుగా, కార్యదర్శిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. చివరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా కూడా మన్మోహన్ సింగ్ తన బాధ్యతలను నిర్వర్తించారు. మృదు స్వభావిగా.. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడిగా మన్మోహన్ సింగ్ పేరుపొందారు. మన్మోహన్ సింగ్ కన్నుమూసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ మృతదేహాన్ని ఆయన స్వగృహానికి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయానికి తరలిస్తారు. ప్రముఖుల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఉంచుతారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular