Thummala Nageswara Rao
Thummala Nageswara Rao: తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఖమ్మంలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గతంలో ఈయన భారత రాష్ట్ర సమితి అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మీద గెలిచారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఉపేందర్ రెడ్డి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. అప్పటినుంచి అటు ఉపేందర్ రెడ్డి వర్గం, ఇటు తుమ్మల వర్గం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీనికి తోడు ఇటీవల భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ ప్రకటించిన జాబితాలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కందాల ఉపేందర్ రెడ్డి కావడంతో తుమ్మల వర్గం ఒక్కసారిగా నిరాశకు గురైంది.
పార్టీ మారాలని ఒత్తిడి
గతంలో పలుమార్లు తుమ్మలకు టికెట్ ఇస్తామని భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆఫర్ ఇచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన ప్లీనరీనీ తుమ్మల ముందుండి నడిపించారు. మంత్రి హరీష్ రావు రాయబారం నడిపి అలకపాన్పు ఎక్కిన తుమ్మలను బుజ్జగించారు. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా వార్తలు వినిపించాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ తుమ్మలకు కెసిఆర్ రిక్తహస్తం చూపించారు. ఇక అప్పటినుంచి ఆయన నిరాశలోనే ఉన్నారు. ఇటీవల కందాల ఉపేందర్ రెడ్డి కి కెసిఆర్ పాలేరు టికెట్ కేటాయించడంతో ఆయన వర్గం మరింత డీలా పడిపోయింది. దీంతో పార్టీ మారాలని తుమ్మల నాగేశ్వరరావు మీద ఆయన అనుచరులు తీసుకొస్తున్నారు. తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని రేణుకా చౌదరి ఇటీవల ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడంతో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేది అనివార్యమైపోయిందని ఆయన అనుచరులు అంటున్నారు.
కన్నీటి పర్యంతం
అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం హైదరాబాద్ నుంచి పాలేరు బయలుదేరారు. తన ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలు కూడా ఆయనను ఊరడించే ప్రయత్నం చేశారు. సుమారు రెండువేల కార్లతో ఆయన ర్యాలీగా బయలుదేరారు. నాయకన్ గూడెం దగ్గర ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం ఒంటెత్తు పోకడలు నశించాలి అని ఆయన కార్యకర్తలు నినాదాలు చేయడం విశేషం. కాగా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం గమనార్హం. కాగా ఆయన కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి ఫోటో గాని లేకపోవడం విశేషం.
అప్పుడు కూడా ఇదే తీరుగా..
2014లో పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నప్పుడు ఇదేవిధంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో పార్టీలు మారెందుకు రాజకీయ వ్యభిచారని కాదని వ్యాఖ్యలు చేశారు. కానీ చివరి నిమిషంలో ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఇక ప్రస్తుతం కూడా ఆయన అదే విధంగా భావోద్వేగానికి గురి కావడం పార్టీ మార్పును సూచిస్తోందని ఆయన అనుచరులు అంటున్నారు. కాగా తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఖమ్మం నుంచి విజయం సాధించారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6000 కోట్ల తేడాతో పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అనంతరం భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశమిచ్చి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖకు మంత్రిని చేశారు. 2016 ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో ఖాళీ అయిన పాలేరు స్థానంలో ఆయన పోటీ చేశారు. రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి భార్య రామిరెడ్డి సుచరిత రెడ్డి మీద ఆయన గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి, సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.