Padala Aruna: జనసేనలో జోష్ నెలకొంది. వారాహి మూడో విడత యాత్ర విశాఖలో ప్రారంభమైంది. జనసేనలోకి భారీ చేరికలు సైతం మొదలయ్యాయి. యాత్ర ప్రారంభానికి ముందు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పడాల అరుణ జనసేనలో చేరారు. పవన్ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. యాత్ర ప్రారంభానికి ముందే రాజకీయ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని.. మున్ముందు పార్టీలో చేరికలు భారీగా ఉంటాయని పవన్ సంకేతాలు ఇచ్చారు.
విజయనగరం జిల్లా రాజకీయాల్లో పడాల అరుణ ది ప్రత్యేక స్థానం. ఎంపీపీ నుంచి మంత్రి వరకు ఆమె ఎదిగారు. మూడుసార్లు గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వహించారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. టిడిపి నుంచి ఆశించిన స్థాయిలో ఆమెకు గౌరవం దక్కలేదు. ఆమె వైసీపీలో చేరుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా జనసేన గూటికి చేరారు.
కాగా పవన్ వారాహి మూడో విడత యాత్ర విశాఖలో ప్రారంభమైంది.తొమ్మిది రోజులపాటు యాత్ర జరగనుంది. పలు సంచలనాలకు వేదిక కానుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.జనసేన పార్టీలో చేరారు.ఇంకా చాలామంది వైసిపి, టిడిపి నాయకులు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.