Narayana: ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు కాక పుట్టిస్తోంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం రాజకీయ రచ్చగా మారనుంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో విచారణకు హాజరుకావాలని సిఐడి అధికారులు నారా లోకేష్ కు నోటీసులు అందించేందుకు సిద్ధపడుతున్నారు. అసలు రోడ్డు నిర్మాణమే చేపట్టని ఈ కేసులో అవినీతి ఎలా అని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ కేసులో భారీగా డబ్బులు మారినట్లు.. కొందరు ఆయాచిత లబ్ధి పొందినట్లు సిఐడి వాదిస్తోంది. విచారణ చేపట్టాలని భావిస్తోంది. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సిఐడి తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో కోర్టు కేసు విచారణకు ఆదేశించింది. దీంతో విచారణకు హాజరు కావాలని లోకేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడింది. ఇదే కేసులో మాజీమంత్రి నారాయణ సైతం సీఐడీ విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో నేను బాధితుడినే అంటూ మాజీ మంత్రి నారాయణ చెప్పడం విశేషం. రింగ్ రోడ్డు అలైన్మెంట్లో తాను సైతం భూమి కోల్పోయానని నారాయణ చెబుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించారు. అనంతరం నారాయణ మాట్లాడారు. లోకేష్ అరెస్ట్ తర్వాత.. మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేస్తారని బయట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నారాయణ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఆ విషయానికి వస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో తనకు చెందిన ఏడు కోట్ల రూపాయల విలువచేసే 41 సెంట్లు భూమి కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవైపు భూసేకరణ జరగలేదని చెబుతూనే.. తన భూమి సైతం రోడ్డు అలైన్మెంట్లో పోయిందని చెప్పడం విశేషం.
వైసీపీ సర్కార్ రాజకీయ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టినా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చారు. స్వామినాథన్ మృతి పై సంతాపం సైతం తెలిపారని వివరించారు. రాష్ట్రంలో తన అరెస్ట్ కు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి దక్కుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే ఇటువంటి దుశ్చర్యలకు దిగారని నారాయణ ఆరోపించారు.
తమపై కక్ష సాధింపునకే నిరాధార ఆరోపణలతో కేసులు నమోదు చేసిన విషయాన్ని నారాయణ గుర్తు చేస్తున్నారు. కోర్టులోనే నిజా నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదని నారాయణ హెచ్చరించారు. టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమైన విషయాన్ని నారాయణ ప్రస్తావించారు. చంద్రబాబు, లోకేష్ లతోపాటు తమలాంటివారు న్యాయస్థానాల్లో నిర్దోషులుగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికైతే తమపై జగన్ సర్కార్ కక్ష సాధిస్తోందని చెబుతూనే అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్లో సొంత ఆస్తులు పోగొట్టుకున్న విషయాన్ని నారాయణ ప్రస్తావించడం విశేషం.