https://oktelugu.com/

Pawan Kalyan Varahi Yatra: జగన్, నానిలను టెన్షన్ పెడుతున్న పవన్.. ఈసారి వారాహి యాత్ర ఎక్కడో తెలుసా?

బాలకృష్ణ తెరపైకి వచ్చినా.. ఇటీవల ఆయన కనిపించకుండా పోయారు. తిరిగి సినిమా సెట్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అటు పవన్ సైతం చంద్రబాబుకు పరామర్శించిన తర్వాత సినిమాల్లో బిజీగా మారిపోయారు.

Written By: , Updated On : September 29, 2023 / 04:50 PM IST
Pawan Kalyan Varahi Yatra

Pawan Kalyan Varahi Yatra

Follow us on

Pawan Kalyan Varahi Yatra: తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయాయి. అధినేత చంద్రబాబు అరెస్ట్ అవుతారని వారు కలలో కూడా ఊహించలేదు. ఒకవేళ అరెస్ట్ అయినా గంటల వ్యవధిలోనే బయటకు వస్తారని భావించారు. లేకుంటే ఒకటి, రెండు రోజుల్లో బయటపడతారని ఊహించారు. కానీ గంటలు గడిచాయి. రోజులు, వారాలు దాటిపోతున్నాయి. కానీ చంద్రబాబు బయటపడే మార్గాలు కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు. అటు ఆందోళనలు, నిరసనలు దాదాపు చల్లారినట్లు కనిపిస్తున్నాయి. ఎన్నికల ముంగిట ఆందోళన కార్యక్రమాలు నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారంగా మారుతున్నాయి.

పోనీ లోకేష్ అయినా మార్గదర్శకం చేస్తారనుకుంటే ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు.ఆయన చుట్టూ కేసులు ముసురుకుంటున్నాయి. అటు తండ్రి అరెస్టు, ఇటు కేసుల భయంతో లోకేష్ సైతం ఇబ్బందుల్లో ఉన్నారు. అటు సీనియర్లు సైతం మౌనం దాల్చడంతో.. కిందిస్థాయి నేతలు సైతం ప్రకటనలు, సమావేశాలకు పరిమితం అవుతున్నారు. అటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజకీయంగా యాక్టివ్ అయినా.. రాజకీయాలకు కొత్త కావడంతో ఆశించిన స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లలేక పోతున్నారు. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన వాతావరణం నెలకొని ఉంది.

బాలకృష్ణ తెరపైకి వచ్చినా.. ఇటీవల ఆయన కనిపించకుండా పోయారు. తిరిగి సినిమా సెట్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అటు పవన్ సైతం చంద్రబాబుకు పరామర్శించిన తర్వాత సినిమాల్లో బిజీగా మారిపోయారు. నాగబాబు, నాదెండ్ల మనోహర్ జిల్లాల పర్యటనకు, టిడిపి శ్రేణులతో సమన్వయానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచడం విశేషం. ఒకవైపు చంద్రబాబు అరెస్ట్, మరోవైపు పవన్ సినిమాల్లో బిజీగా ఉండగా.. అదును చూసి జగన్ ప్రజల్లోకి వస్తున్నారు. విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు తో పాటు పవన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.

వారాహి యాత్ర అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పవన్ యాత్ర ప్రారంభించనున్నారు. అప్పటికే చంద్రబాబు రిమాండ్ విషయంలో ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి కలిగితే మాత్రం పవన్ తో పాటు ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అటు వారాహి యాత్రలో సైతం పవన్ సంచలన ప్రసంగాలు సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటివరకు జగన్కు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని.. ఇప్పటికీ ఆయన తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నారని.. అన్ని వర్గాల ప్రజలకు దూరమవుతున్నారని పవన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసిపి కీలక నేతలుగా ఉన్న పేర్ని నాని, ఇతరత్రా నాయకుల నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర సాగనుండటంతో సంచలనాలకు వేదికగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.