Chintakayala Ayyanna Patrudu: ఏపీలో సీఐడీ వైసీపీ సర్కారు జేబు సంస్థగా మారిపోయింది. అటు పోలీస్ శాఖ గురించి చెప్పనక్కర్లేదు. రాజకీయ ప్రత్యర్థులపై ఈ రెండు డిపార్టుమెంట్లతో ప్రభుత్వ పెద్దలు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని అర్ధరాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయండ చర్చనీయాంశమైంది. అటు ఆయన చిన్నకుమారుడు రాజేష్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి హడావుడి లేకుండా అర్ధరాత్రి అయ్యన్నపాత్రుడు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని పెద్దఎత్తున బలగాలతో మొహరించారు. సెల్ ఫోన్ సిగ్నల్ సైతం నిలిపివేశారు. అయితే ఈ విషయం బయటకు పొక్కి నాయకులు, కార్యకర్తలకు చేరుకోకముందే కుటుంబసభ్యుల చేతిలో నోటీసు పెట్టి రాజమండ్రి తీసుకెళుతున్నట్టు చెప్పి.. ఇదర్నీ తరలించుకుపోయారు. ఈ హఠాత్ పరిణామంతో చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

అటు సీఐడీ పోలీసులు ప్రభుత్వ ప్రైవేటు సైన్యం మాదిరిగా వ్యవహరిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారని ఫిర్యాదులు వస్తున్నా.. వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. గతంలో అయ్యన్నపాత్రుడుతో పాటు ఆయన కుమారుడు విజయ్ ను అరెస్ట్ చేయ్యాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకోగలిగారు. అయితే అయ్యన్నపై గతంలో సీఐడీ పోలీసులు చాలావరకూ కేసులు నమోదుచేశారు. అయితే వాటన్నింటిపై రక్షణ పొందుతూ వస్తున్న ఆయనపై ఇటీవల ఎవరికీ తెలియకుండా కొత్త కేసు ఒకటి నమోదుచేశారు. బెయిల్ పొందే క్రమంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు దాఖలు చేశారని ఆరోపిస్తూ తాజాగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇటువంటి కేసులు గతంలో ఎప్పుడూ నమోదైన దాఖలాలు లేవు. కానీ దానినే కారణం చూపిస్తూ అర్ధరాత్రి అరెస్ట్ లు చేయడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అయ్యన్నపాత్రుడ్ని నెట్టుకుంటూ వెళుతున్న దృష్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ రియాక్టవుతున్నారు.

అయితే అయ్యన్నపాత్రుడితో పాటు కుమారుడు విజయ్ టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.దూకుడు కలిగిన నాయకులుగా పేరుంది. వైసీపీ సర్కారుతో పాటు జగన్ పై వ్యక్తిగత విమర్శలకు సైతం వీరు వెనుకాడడం లేదు. దీంతో ప్రభుత్వ పెద్దలు అయ్యన్న కుటుంబంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకూ ఎన్నో కేసులు నమోదుచేశారు. చివరకు నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి గోడను సైతం కూల్చేశారు. అయ్యన్న కుమారుడు విజయ్ టీడీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను చూస్తున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో ప్రధానంగా విజయ్ పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకులిద్దర్నీ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టాలని ఎప్పటి నుంచో చూస్తూ వచ్చారు. ఎంపీ రఘురామక్రిష్ణం రాజు తరహాలో ట్రీట్ మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారు. కొద్దిరోజులుగా అయ్యన్న కూడా ఇటువంటి అనుమానమే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సేమ్ సీన్ రిపీట్ కావడంతో అయ్యన్నపై చేయిచేసుకునే దృశ్యాలను కీలక నేతకు చూపించేందుకే సీఐడీ పోలీసులు దుస్సహాసానికి దిగారని టీడీపీ శ్రుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.