Former Minister Anil- Jana Sena: ఏపీలో ఇప్పుడు కొత్త వార్త హల్ చల్ చేస్తోంది. అధికార పార్టీని కలవరపెడుతోంది. అదే జగన్ ప్రధాన అనుచరుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జనసేనలోకి చేరబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్న ఎదురవుతోంది. అదే సమయంలో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న సమాధానం కూడా వస్తోంది. అనిల్ రాజకీయ ప్రస్థానం పీఆర్పీతో ముడిపడి ఉండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అనం కుటుంబీకుల ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాజకీయ అరంగేట్రం చేసిన అనిల్ తన దూకుడు స్వభావంతో రాజకీయ బాటలు వేసుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు నెల్లూరు పెద్దా రెడ్ల బాధ్యుడిగా మారి ఒంటరైన అనిల్ కు జనసేన ఒకటే ప్రత్యమ్నాయంగా కనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి మాత్రం ఆయన గెలుపు కష్టమేనని పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఇంటా బయట అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. వైసీపీ ఆవిర్భావం తరువాత ఆయన జగన్ వెంట నడుస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా గెలుపొందారు. గత ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో గెలుపొందారు. గతసారి జనసేన, టీడీపీ విడిగా పోటీచేయడంతో ఆయన గెలుపు సాధ్యమైంది. ఈసారి టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండడంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. ఈసారి గెలుపు ఈజీ కాదన్న నిర్ణయానికి వచ్చారు.
గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిల్ కుమార్ యాదవ్ ను జగన్ అనూహ్యంగా తన కేబినెట్ లో అవకాశమిచ్చారు. కీలకమైన సాగునీటి వనరుల శాఖను అప్పగించడంతో ఇక తనకు తిరుగులేదని అనిల్ భావించారు. దూకుడుగా వ్యవహరించారు. అటు జిల్లాలో సీనియర్లుగా నెల్లూరు పెద్దా రెడ్లు ఉన్నా వారిని లెక్క చేయలేదు. తనకు జగన్ అండదండలు ఉన్నాయని భావించి దూకుడు స్వభావాన్ని మరింత పదునెక్కించారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న లాజిక్ ను మాత్రం మరిచిపోయారు. పునర్ వ్యవస్థీకరణ పేరుతో జగన్ అనిల్ రెక్కలను కట్ చేశారు. కాకాని గోవర్థన్ రెడ్డికి అవకాశమిచ్చారు. దీంతో అప్పటి నుంచి అనిల్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. సొంత పార్టీలోనే ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మరోవైపు అనం వంశీయుల రూపంలో మరో గండం పొంచి ఉంది. సీనియర్ల నుంచి ఆయనకు సహాయ నిరాకరణ ప్రారంభమైంది.

అదే సమయంలో వైసీపీ కూడా నెల్లూరు సిటీ నుంచి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెరపైకి తెచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య కుమార్తెను వైసీపీలోకి తెచ్చి పోటీచేయించాలన్న తలంపులో అధిష్టాన పెద్దలు ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇన్నాళ్లూ తాను ఎంతో నమ్మకంతో ఉన్న అధిష్టాన పెద్దల సడన్ గా వ్యూహం మార్చడంపై అనిల్ ఆవేదనతో ఉన్నారు. దీంతో అదే వేగంతో రాజకీయ స్ట్రాటజీని మార్చారు. అనూహ్యంగా పవన్ విషయంలో సైలెంట్ అయ్యారు. తనను వైసీపీ వదులుకుంటే జనసేనలో తనకు చాన్స్ ఉందన్న సంకేతాలు అధిష్టానానికి పంపుతున్నారు. అటు జనసేన కీలక నాయకులతో అనిల్ టచ్ లో ఉన్నారన్న ప్రచారం ఉంది. ఎన్నికలు సమీపించే నాటికి నెల్లూరు జిల్లా రాజకీయాలు శరవేగంగా మారే అవకాశముంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనే సేఫ్ జోన్ గా ఎంచుకున్నట్టు సమాచారం.