Homeజాతీయ వార్తలుChandravadan: ఓహో.. తొక్కేయాలనే అప్పుడు కేసీఆర్ రాధాకృష్ణ దగ్గరకు వచ్చాడా?

Chandravadan: ఓహో.. తొక్కేయాలనే అప్పుడు కేసీఆర్ రాధాకృష్ణ దగ్గరకు వచ్చాడా?

Chandravadan: “ప్రభుత్వ పాలనలోని లోపాలను చూపుతున్నందుకు మా సంస్థలను తొక్కేద్దామని సీఎం కేసీఆర్ అనుకున్నాడు. అదే విషయాన్ని అప్పటి పౌర సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి చంద్రవదన్ తో అన్నాడు. అందుకే మాకు ప్రకటనలు ఇవ్వకుండా, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం పలకకుండా అవమానిస్తున్నాడు” ఇదీ పొద్దున ఆంధ్రజ్యోతి పేపర్ లో కనిపించిన వార్త. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటనల వల్ల రెండు ఫస్ట్ పేజీల తర్వాత (యాడ్స్ కోసం ఎలాంటి కుప్పిగంతులైనా వేస్తారు) మూడో ఫస్ట్ పేజీలో కనిపించింది ఈ వార్త. వాస్తవానికి చంద్రవదన్ పదవి విరమణ పొందిన తర్వాత పెద్దగా వార్తల్లో లేడు. హఠాత్తుగా నిన్న ఏబీఎన్ న్యూస్ ఛానల్ డిబేట్లో కనిపించాడు. ఎలాగూ ఇప్పుడు ఏబీఎన్ కాంగ్రెస్ పాట పాడుతోంది కాబట్టి.. చంద్రవదన్ కూడా పదవిలో లేడు కాబట్టి.. స్వతహాగానే తాను కమిషనర్ గా ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. పనిలో పనిగా నాడు కెసిఆర్ యాడ్ బిస్కెట్స్ ఎవరికి ఇవ్వాలో, ఏ పత్రికకు ఏ స్థాయిలో ప్రభుత్వ ధనాన్ని కట్టబెట్టాలో దిశా నిర్దేశం చేసాడని చెప్పుకొచ్చాడు.

నిజానికి ఏబీఎన్ ఇప్పుడు ఎందుకు పిలిచింది అంటే.. కెసిఆర్ పాలనలో జరిగిన తప్పులను ప్రజల ముందు ఉంచాలి కాబట్టి.. అది కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ కావాలి కాబట్టి.. ఆ తీరుగా డిబేట్లు రన్ చేస్తోంది. వాస్తవానికి ప్రైమ్ టైం డిబేట్లో ఏపీ విషయాలు తప్ప తెలంగాణ విషయాలు పెద్దగా పట్టించుకోని ఏబీఎన్.. హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద ఫోకస్ చేయడం ఒకింత ఆశ్చర్యమే. నాడు అంటే 2014లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వకుండా తనకు ఆదేశాలు జారీ చేశారని అప్పటి సమాచారం ప్రసార శాఖ కమిషనర్ చంద్రవదన్ చెప్పుకొచ్చారు. “సార్ మీరు చేస్తున్నది తప్పు” అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదని కుండ బద్దలు కొట్టారు. అధికార వ్యవస్థను తన సొంత లాభానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని, స్వాతంత్ర్య వేడుకలకు దూరం పెట్టడం కూడా సరికాదని చంద్రవదన్ తూర్పారబట్టారు. స్థూలంగా చూస్తే చంద్రవదన్ కు పెద్దగా పొలిటికల్ ఇంట్రెస్ట్ లు ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ చేసిన కామెంట్లు ఒకింత ఆశ్చర్యాన్ని, గతంలో జరిగిన గూడుపుఠాణి ని బయటపెడుతున్నాయి.

Chandravadan
Chandravadan

చంద్రవదన్ చెప్పినట్టు వేమూరి రాధాకృష్ణకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య ఉన్నది బావా బామ్మర్దుల బంధం. 2014లో కాలేజీ యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా పది కిలోమీటర్ల లోతులో తొక్కుతానని సవాల్ చేసిన పెద్దమనిషి.. తర్వాత తాను నిర్వహించిన ఆయాత చండీయాగానికి పిలిచాడు. మెడ మీద శాలువా కప్పి ఏర్పాట్లు బాగున్నాయా అడిగాడు. రాధాకృష్ణ ఆఫీస్ కాలిపోయినప్పుడు ఓదార్చాడు. ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆఫీస్ కట్టుకోవడానికి స్థలం ఉదారంగా ఇచ్చాడు. ఆ మధ్య జాకెట్స్ కూడా దండిగానే మంజూరు చేశాడు. అయితే కొన్నాళ్లు ఇదే ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణకు మించి కెసిఆర్ కు భజన చేసింది. ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చిన రాధాకృష్ణ చంద్రబాబుకు కమిటెడ్ సోల్జర్ కాబట్టి 2018 ఎన్నికల్లో అవుట్ రైట్ గా కేసీఆర్ ను విభేదించాడు. ఇక అప్పటి నుంచి మొదలైన వైరం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది.. ఇది ఇంకా ఎన్ని రూపాలు తీసుకుంటుందో తెలియదు గానీ ప్రస్తుతానికైతే ఉప్పు నిప్పులాగానే వ్యవహారం ఉంది. ఈరోజు ఉదయం చంద్రవదన్ చేసిన వ్యాఖ్యలను బ్యానర్ వార్తగా తీసుకున్న ఆంధ్రజ్యోతి.. తన ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నాడు కాబట్టి కెసిఆర్ మీద దుమ్మెత్తి పోసింది. ఇది ఎవరి ప్రయోజనాల కోసం వార్త రాయబడిందో తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కారు. అన్నట్టు
“పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు” వెనుకటి కాలంలో ఓ మహానుభావుడు ఊరకనే అనలేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version