
JD Lakshminarayana: లక్ష్మీనారాయణ.. సిబిఐ జేడిగా పని చేశారు. ఎన్నో కీలకమైన కేసులను చేదించారు.. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. చాలామందిని జైలులోకి పంపించారు. అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే ఆకస్మాత్తుగా తన విలువైన సర్వీసును వదిలిపెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పిస్తున్నారు.. అలాంటి ఆయన వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఈ ముఖాముఖిలో పలు ప్రశ్నలకు లక్ష్మీనారాయణ సమాధానాలు చెప్పారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదలైంది.
తన ఫాషన్ కు అడ్డు వస్తుందని సివిల్ సర్వీసును లక్ష్మీనారాయణ తృణప్రాయంగా వదిలిపెట్టారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు.. కానీ ఆయన అనుకున్నంత సులభంగా అది జరగలేదు.. రాజకీయాలు ఆయనకు కేక్ వాక్ కాలేదు. పైగా ఆయన తన సర్వీస్ నుంచి వై దొలిగిన క్షణంలో చాలామంది రాజకీయ పార్టీ పెట్టాలని సలహాలు ఇచ్చారు. కానీ రాజకీయ పార్టీని నడిపేంత ఇంధనం తన దగ్గర లేకపోవడంతో లక్ష్మీనారాయణ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సివిల్ సర్వీస్ అనేది దేశాన్ని నడిపిస్తుందని, కానీ కొంతమంది సివిల్ సర్వెంట్లు పాలకులకు తొత్తులుగా మారి వ్యవస్థను నాశనం చేస్తున్నారనేది లక్ష్మీనారాయణ ప్రధాన ఆరోపణ.. దీనివల్ల చాలామంది జీవితాలు ప్రభావితమవుతున్నాయనేది లక్ష్మీనారాయణ ఆవేదన. “మన హక్కుల కోసం పదేపదే తేనెటీగల మాదిరి గుచ్చాలి. అప్పుడే అవి నెరవేరుతాయి. లేకుంటే కష్టమవుతుంది.. వ్యవస్థను నడిపిద్దాం అనుకునేవాళ్ళు ఖచ్చితంగా తిరగబడే స్వభావాన్ని కూడా నేర్చుకోవాలి” అని లక్ష్మీనారాయణ వివరించారంటే వ్యవస్థలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

” వైసిపి వాళ్ళు అడుగుతున్నారు.. భారత రాష్ట్ర సమితి వాళ్లు ఆఫర్ ఇచ్చారు.. ఆప్ నేతలు కూడా రమ్మంటున్నారు. అంటే రోజు నేను మూడు పార్టీల్లో చేరుతున్నాను” అని రాజకీయ రంగ పున: ప్రవేశం పై ఆర్కే అడిగిన ఒక ప్రశ్నకు లక్ష్మీనారాయణ సమాధానం చెప్పారు.. రాజకీయాలు ఒక నిచ్చెన అనుకున్నప్పుడు, దానిని శుద్ధి చేయాలి అని అనుకున్నప్పుడు.. పై భాగం నుంచి మొదలుపెట్టాలి.. అప్పుడైతేనే మనం మార్పు ఆశించగలం అని తాను కోరుకున్న సమాజం ఎలా ఉండాలో లక్ష్మీనారాయణ విశదీకరించారు. కవిత, వివేకానంద రెడ్డి హత్య కేసుల పై కూడా లక్ష్మీనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ” ఇప్పుడు వీళ్లు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఒకరకంగా మాట్లాడుతారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడుతారు.. వాళ్లకు ఎలా అవకాశం ఉంటే అలా మాట్లాడతారు.. దానిని మనం ఏమి చేయలేము అని” లక్ష్మీనారాయణ కుండబద్దలు కొట్టారు.. అంతేకాదు రాధాకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు తడుము కోకుండా సమాధానం చెప్పారు. ఇక వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇంకా ఎన్ని సంచలన విషయాలు బయటపెడతారో వేచి చూడాల్సి ఉంది.