Uttar Pradesh : చిన్నారుల మూత్రం.. రంగురంగుల బొమ్మలు.. యూపీ తోడేళ్ల వేటలో సరికొత్తకోణం

మొన్నటిదాకా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు సందడి చేశాయి. యోగి మార్క్ పాలనలో అక్రమార్కుల ఇళ్లపైకి దండెత్తాయి.. అలాంటి ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఆపరేషన్ బేడియా కొనసాగుతోంది. బేడియా ను తెలుగులో తోడేలు అంటారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోడేళ్లు అక్కడి ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. వాటిని పట్టుకునేందుకు యూపీ ప్రభుత్వం ఆపరేషన్ బేడియాను మొదలుపెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 2, 2024 5:52 pm

wolves in up

Follow us on

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్లు విపరీతంగా సంచరిస్తున్నాయి. కొన్ని నెలలుగా మహసి అనే ప్రాంతంలో తోడేళ్ల సంచారం పెరిగిపోయింది. ఇవి దాడి చేయడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తోడేళ్లను వేటాడేందుకు అక్కడి అధికారులు ముంబరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. మిగతా వాటికోసం గాలిస్తున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారుల మూత్రంతో తడిపిన రంగురంగుల బొమ్మలను తోడేళ్లకు ఎరగా వేస్తున్నారు. ఈ జిల్లాలో మొత్తం ఆరు తోడేళ్లు సంచరిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్ బేడియాలో ఇప్పటివరకు 4 తోడేళ్లను పట్టుకున్నారు. మిగతా వాటిని పట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. తోడేళ్లను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన డెన్లు, నది పరివాహక ప్రాంతాల్లో రంగురంగుల బొమ్మలను ఏర్పాటు చేశారు. వాటిని చిన్నారుల మూత్రంతో తడిపారు. చిన్నారుల మూత్రం వాసన చూసిన తోడేళ్లు వాటిని మనిషి వాసన లాగా భ్రమిస్తాయి. అందువల్లే వాటిని ఉచ్చులోకి లాగుతామని అటవీశాఖ అధికారులు అంటున్నారు.. మరోవైపు ఈ తోడేళ్లు ఎప్పటికప్పుడు స్థావరం మార్చుకుంటున్నాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. రాత్రి సమయాల్లో వేటాడి.. ఉదయం గుహలకు చేరుతున్నాయి. అందువల్లే అటవీ శాఖ అధికారులు వాటి గమనాన్ని తప్పుదారి పట్టించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉచ్చులు, బోనులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తోడేళ్లు చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. అందువల్లే రంగు రంగుల బొమ్మలను పిల్లలుగా భ్రమించేలా అటవీ శాఖ అధికారులు అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ బొమ్మలకు చిన్నారుల దుస్తులు వేస్తున్నారు. ఆ దుస్తులను చిన్న పిల్లల మూత్రంతో తడుపుతున్నారు.

ఇంత చేస్తున్నప్పటికీ

అటవీ శాఖ అధికారులు ఇంత చేస్తున్నప్పటికీ తోడేళ్లు దాడులను ఆపడం లేదు. ఆదివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఒక మూడు సంవత్సరాల చిన్నారి కన్ను మూసింది. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. తోడేల దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటికి 8 కి చేరింది. ఇంతమందిలో ఏడుగురు చిన్నారులు కావడం విశేషం. ఇక ఉత్తర ప్రదేశ్ లో తోడేళ్లు సంచరిస్తున్న తీరు వల్ల బీహార్లో నక్కలు ఇబ్బంది పడుతున్నాయి. బీహార్ రాష్ట్రంలోని మక్సూద్పూర్ ప్రాంతంలో ఆదివారం ఒక నక్కను తోడేలుగా భావించి స్థానికులు చంపేశారు. అయితే ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోడేలుగా భావించి నక్కను చంపడం సరికాదని అంటున్నారు. తోడేళ్ల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో అటు ఉత్తర ప్రదేశ్ – ఇటు బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.