Mahabalipuram: తాజ్ మహల్.. తన భార్య ముంతాజ్ స్మృత్యర్థం షాజహాన్ కట్టించిన అపురూప కట్టడం. ప్రతిరూపంగా విలసిల్లుతున్న ఈ కట్టడం ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే రెండవ ప్రాంతంగా ఇది వినతి ఎక్కింది. దీనికంటే ముందు అమెరికాలోని నయాగరా ఫాల్స్ ఉన్నాయి. ఇక దేశంలో పర్యటించేందుకు వచ్చే విదేశీ పర్యాటకులు ముందుగా తాము చూసేది తాజ్ మహల్ నే. తే ఇది నిన్న మొన్నటి వరకు మాటే. ఇప్పుడు విదేశీ పర్యాటకులు తాజ్ మహల్ కంటే చెన్నైకి సమీపంలోని ఓ గుడికి ముందుగా వెళ్తున్నారు. ఆ తర్వాతే మిగతా ప్రాంతాలు సందర్శిస్తున్నారు. ఇంతకీ ఏమిటి ఆ గుడి? అసలు దాని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా ?

అపురూపమైన కట్టడం
తమిళనాడు రాష్ట్రం కాంచి పురం జిల్లాలో మహాబలిపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చాళక్యులు నిర్మించిన గుడి. ఆలయ గర్భగుడిలో అసలు గాలి అనేది రాకుండా, కనీసం కిటికీలు, రంధ్రాలు లేకుండా నిర్మించిన అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటి తరానికి అర్థం కాదు. ఇక్కడ ఉన్న శ్వేత సౌధం దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే మహాబలిపురం గుడి పైన ఉన్న శిల్పాలను గమనిస్తే రోదసిలోకి వెళుతున్న వ్యోమగాములను తలపిస్తాయి. క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ రాజుల రాజ్యానికి మహా బలిపురం తీర పట్టణంగా ఉండేది. ఈ పట్టణానికి అప్పటి పల్లవుల ప్రభువైన మామ్మల్లా పేరు పెట్టారు. కాలక్రమంలో అది మహాబలిపురం అయింది. ఇక్కడ ఉన్న గుహాలయాల నిర్మాణశైలి విభిన్నంగా ఉండటంతో విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు. పల్లవుల పరిపాలన కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణ యుగంగా వెలుగొందింది. ఆ రోజుల్లోనే వారు మహాబలిపురాన్ని మంచిరేవు పట్టణంగా తీర్చిదిద్దారు. దీనికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ కూడా నిర్మించారు.

అబ్బురపరిచే నిర్మాణాలు
మహాబలిపురంలో గుహాలయాల్లో ఏటవాలు కొండపైన ఏ ఆధారం లేకుండా పురాతన కాలం నుంచి పడిపోకుండా ఓ రాయి అలానే ఉంది. చూసేందుకు ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక చెట్టుకి కాసే కాయలు అరచేయంత పరిమాణం కలిగి ఉంటాయి. ఇంకా అర కిలోమీటర్ పొడువులో ఉండే పాండవ రథాలు, సుందరమైన సి షోర్ టెంపుల్ ఉన్నాయి. ఇక్కడ అనేక దేవాలయాలను పెద్దపెద్ద శిలలతో చెక్కారు. వీటినే ఇక్కడ గుహాలయాలు అని పిలుస్తారు. 600 నుంచి 700 సంవత్సరాల మధ్య మహాబలిపురంలో శిల్పులు పెద్దపెద్ద శిలలకు నైపుణ్యంతో జీవం పోసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక పాండవ రథాల్లో నాలుగింటిని ఏక శిలలతో నిర్మించారు. పల్లవుల కళా నైపుణ్యానికి మచ్చు తునకలని చరిత్ర చెబుతుంటారు. ఇక్కడ నిర్మించిన తొమ్మిది గుహాలయాల్లో మహిషాసుర మండపానికి చాలా ప్రత్యేకత ఉంది.

ఈ మండపంలో మహిషాసురుడికి, దుర్గా మాతకు జరిగిన పోరాటం, రాక్షసులను సంహరించిన విధానం చెక్కారు. ఇక్కడ నల్ల రాతితో చెక్కిన నంది, సింహం, ఏనుగు వంటి శిలారూపాలు సహజంగా కనిపిస్తాయి. కృష్ణ మండపంలో రాతి మీద భాగవత కథ శిల్ప రూపంలో అద్భుతంగా చెక్కి ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. పైగా ప్రపంచ పర్యాటకులు కూడా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తున్నారు. కేంద్రం వెలుపరించిన జాబితా ప్రకారం జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు మూడు లక్షల మంది విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని చెబుతోంది. ఇదే సమయంలో తాజ్ మహల్ సందర్శించిన వారి సంఖ్య 1.5 లక్షలు గా ఉంది. అయితే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించాలన్న యోచనలో పర్యాటక శాఖ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు.