Ponniyin Selvan: సినిమా రంగంలో సూపర్ దర్శకులున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇందులో గీతాంజలి, బొంబాయి, రోజా వంటి సినిమాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. నాగార్జున తో చేసిన గీతాంజలి ఓ ట్రెండ్ సృష్టించింది. ఇక అరవింద స్వామి హీరోగా నిర్మించిన రోజా, బొంబాయి సినిమాలు కూడా సంచలనం సృష్టించాయి. బాక్సాఫీసును బద్దలు చేశాయి. దీంతో ఆయన దర్శకత్వ ప్రతిభ మీద అందరికి నమ్మకం ఎక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం రాజుల కథలనే ఇతివృత్తంగా సినిమాలు తీస్తుండటంతో మణిరత్నం కూడా ఓ సాహసం చేశారు. వెయ్యేళ్ల కిందట జరిగిన చోళ రాజుల కథాంశంతో పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ విడుదలైంది. చిత్ర నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సీన్ పండేలా ప్లాన్ చేసుకున్నారనే తెలుస్తోంది.

కథ విషయానికి వస్తే తమిళనాడులో జరిగిన చోళ రాజుల మధ్య జరిగిన గాథను ఇతివృత్తంగా చేసుకుని సినిమా తీయడమంటే మాటలు కాదు. దానికి ఎంతో సహనం ఉండాలి. పాత్రల ఎంపిక, కథనం నడిపించే తీరు మీద పట్టు ఉండాలి. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వ ప్రతభ మీద నమ్మకం ఉండటంతోనే ఇది సాధ్యమైంది. సినిమాలో మొదట కార్తి పాత్ర, తరువాత జయం రవి పాత్రలు మెరిశాయి. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు సఫలత సాధించాడు. సెకండాఫ్ లో ూకడా డ్రామా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల మధ్య సంక్లిష్టతను ప్రేక్షకుడు ఫీలయ్యేలా ప్లాన్ చేశారు. మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా వారిని రెండున్నర గంటలు కూర్బోబెట్టేందుకు తిప్పలు పడినట్లు తెలుస్తోంది.
రాజులు, వారి మధ్య యుద్దాలను హైలైట్ చేశారు. కానీ తమిళ ప్రేక్షకులకు అర్థమైనంత విధంగా మిగతా భాషల వారికి కాదనే చెప్పాలి. ఎందుకంటే చోళరాజులు తమిళ ప్రాంతాలను పాలించిన వారైనందున మనకు అంతగా తెలియదు. దీంతో ప్రేక్షకుడికి సందేహాలు వస్తుంటాయి. ఇక హీరోయిన్లయితే గ్లామర్ కు ప్రాధాన్యం ఇచ్చారు. ఐశ్వర్య, త్రిష పోటీపడి నటించారు. చోళ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలకు కూడా ఏఆర్ రహమాన్ అద్భుతమైన బాణీలు అందించారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమా సూరరైనా కొన్ని అనుమానాలు మాత్రం ప్రేక్షకులకు వస్తున్నాయనడంలో సందేహం లేదు.

ఇక తోట తరణి ప్రొడక్షన్ వర్క్ సినిమాకు బలం ఇచ్చింది. మణిరత్నం మేకింగ్ కనిపించింది. తన ప్రతిభతో తిమ్మిని బమ్మి చేయగల సమర్థుడు. అందుకే ఇంత పెద్ద ప్రాజెక్టును ఆయన చేతిలో పెట్టారు. మొత్తానికి సినిమా గురించి చెబితే ఇదో మణిరత్నం మార్క్ సినిమా అనొచ్చు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రమని ప్రేక్షకుడు చెబుతాడు. మణిరత్నం పీఎస్-2 లో ఏం చూపిస్తాడోననే ఆతృత అందరిలో వస్తోంది. బాహుబలి2 కు కూడా ఇదే ఉత్కంఠ అందరిలో కనిపించింది.