Foreign exchange reserves : ఒక దేశానికి సంబంధించి అభివృద్ధి సూచిని ఫారెక్స్ మార్కెట్ నిర్ణయిస్తుంది అంటారు ఆర్థిక నిపుణులు. అలాంటి ఫారెక్స్ మార్కెట్ నిల్వలో ఇప్పటికీ అమెరికా ముందు వరుసలో ఉంటుంది. అప్పుడప్పుడు చైనా దాన్ని బీట్ చేస్తుంది గాని.. దీర్ఘకాలంలో మాత్రం చైనా ఎప్పుడూ ముందు వరుసలో లేదు. అమెరికాలో ఉన్న విధానాలు.. ప్రపంచం పైన దాని పెత్తనం.. ఇంకా రకరకాల కారణాలు విదేశీ మదుపర్లను అమెరికా వైపు చూసేలా చేస్తాయి. అదే చైనా విషయంలోనూ ఇలాంటి సానుకూల అంశాలు లేనప్పటికీ తయారీ రంగం అక్కడ బలంగా ఉండటంతో చాలామంది అక్కడ పెట్టుబడులు పెడుతుంటారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు అధికంగా ఉంటే పెట్టుబడిదారులకు ఆ దేశం పై నమ్మకం పెరుగుతుంది. మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నింటికీ మించి ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
ఇక పై ఉపోద్ఘాతంలో చైనా, అమెరికా గురించి మాత్రమే ప్రస్తావించాం. మన దేశంలో కూడా రికార్డు స్థాయికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చేరుకున్నాయి. గత కొంతకాలంగా నేల చూపులు చూసిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో పెరగడాన్ని గొప్ప విషయంగా పరిగణిస్తున్నారు ఆర్థికవేత్తలు. ఫిబ్రవరి రెండుతో ముగిసిన వారంతో పోలిస్తే భారతదేశంలో విదేశీ భారత ద్రవ్య నిల్వలు పెరిగాయి. ఈ వారం 622.469 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఫిబ్రవరి 2 తో ముగిసిన వారంతో పోల్చితే 5.736 బిలియన్ డాలర్లు ఎక్కువ. రిజర్వ్ బ్యాంక్ ప్రతి వారంలో వెలువరించే నివేదిక ప్రకారం.. భారతదేశ విదేశీ మారక నిల్వల్లో అతిపెద్ద వాటా విదేశీ కరెన్సీ ఆస్తులు. ఇది ప్రస్తుతం 5.186 బిలియన్ డాలర్లు పెరిగి.. 551.331 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
విదేశీ మారకద్రవ్య నిల్వలు మాత్రమే కాకుండా దేశంలో పసిడి నిల్వలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పసిడి నిల్వలు 680 మిలియన్ డాలర్లు పెరిగి 48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్ నెలలో భారత విదేశీ మారక నిలువలు గరిష్ట స్థాయిలో 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంపై దిగుమతుల వ్యయం విపరీతంగా పెరగడంతో 2022 సంవత్సరంలో విదేశీ మారక ద్రవ్య నిలువలు గణనీయంగా తగ్గాయి. అప్పట్లో రూపాయి ధర పతనం కావడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడంతో నరేంద్ర మోడీపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో కరెన్సీ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడంతో ఒకసారిగా పరిస్థితి మారిపోయింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడంతో విదేశీ కరెన్సీ ఆస్తుల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతోపాటు దేశంలో తగినన్ని ఫారెక్స్ రిజర్వ్ లు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఫలితంగా మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏ దేశంలోనైనా సరే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత భారీగా ఉంటే.. ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉన్నట్టు లెక్క. ఇక దేశ ఆర్థిక స్థిరత్వంలో ఫారెక్స్ రిజర్వ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగడం తమ ప్రభుత్వ పనితీరును సూచిస్తుందని బిజెపి నాయకులు చెబుతున్నారు. గతంలో నిల్వలు తగ్గినప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయని.. ఇప్పుడు నిల్వలు పెరుగుతుంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటాయని వారు దెప్పిపొడుస్తున్నారు.