Arvind Kejriwal : ఏ ముహూర్తాన జట్టుగా ఇండియా కూటమి ఏర్పడిందో.. ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే నితీష్ కుమార్ బయటికి వెళ్లిపోయాడు. బిజెపితో జట్టు కట్టి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో గుడ్లు ఉరిమి చూస్తోంది. నా దారి నాదే.. మీ దారి మీదే అంటూ గెట్లు పెడుతోంది. కమ్యూనిస్టులతో దోస్తీ అనేదే కుదరదని తేల్చి చెబుతోంది. ఈ పరిణామాలతో ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. వీటిని ఉదాహరణగా చూపి నరేంద్ర మోడీ అటు పార్లమెంటు, ఇటు రాజ్యసభలో చెడుగుడు ఆడుకుంటున్నాడు. సర్వే సంస్థ లేమో మళ్ళీ మోడీ గెలుస్తాడు అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కొద్దో గొప్పో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం శనివారంతో సడలిపోయింది..
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నామని ఆర్ఎల్డీ అధినేత జయంత్ సింగ్ చౌదరి ప్రకటించారు.. ఇండియా కూటమితో తెగ తెంపులు చేసుకుంటామని సంకేతాలు ఇచ్చారు. ఈ విషయం మర్చిపోకముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అన్ని స్థానంలో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఆ పార్టీ కూడా కూటమికి దూరం జరిగిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇటీవల నితీష్ కుమార్ ఇండియా కూటమితో తెగ తెంపులు చేసుకొని బిజెపితో జట్టు కట్టారు. బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని మర్చిపోకముందే జయంత్ సింగ్ చౌదరి, అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటనలు చేయడంతో ఇండియా కూటమి మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే విషయంపై కాంగ్రెస్, ఆప్ మధ్య చిక్కుముడి విడలేదు. గత కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ అవి సఫలీకృతం కావడం లేదు. దీంతో విసిగి వేసారిన అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలోని మొత్తం 14 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వెల్లడించారు. అంతేకాదు ఈ నెలాఖరులోగా పంజాబ్ రాష్ట్రంలోని 13 ఎంపీ స్థానాలకు, చండీగఢ్ లోక్ సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. ఇక ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర బీహార్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలోని బిజెపి పై కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అయినప్పటికీ కూటమి బలోపేతం కావడం లేదు. నరేంద్ర మోడీ చెప్పినట్టుగానే ఒక్కో పార్టీ బయటకు వెళ్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల వరకు కూటమిలో ఎన్ని పార్టీలు ఉంటాయో అంతు పట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.