Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గం పై క్లారిటీ వస్తోందా? ఈపాటికే అక్కడ గ్రౌండ్ వర్క్ ప్రారంభమైందా? పార్టీ శ్రేణులను కోఆర్డినేట్ చేసే బాధ్యతలను నాగబాబు తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేశారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి బరిలో దిగారు. కానీ రెండు చోట్ల ఓటమి ఎదురైంది. ఈసారి కూడా రెండు చోట్ల పోటీ చేస్తారన్న టాక్ అయితే ఉంది. కానీ ఎక్కడెక్కడ అన్నది మాత్రం క్లారిటీ లేదు.
పవన్ పోటీ చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాల సంఖ్య 10 వరకు ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో ప్రధాన నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేయాలని స్థానిక పార్టీ శ్రేణులు కోరుతూ వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటపడింది. ఈసారి పవన్ తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఒక వార్త బయటకు వచ్చింది. ఆ మధ్యన నాగబాబు పర్యటనతో పార్టీ శ్రేణులకు ఒక విధమైన స్పష్టత వచ్చింది. పార్టీ శ్రేణులు తిరుపతి నుంచి పవన్ పోటీచేయాలని బలమైన ఆకాంక్షను నాగబాబు ముందు ఉంచారు. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాల జాబితాలో తిరుపతి సైతం ఉండడంతో నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన తర్వాత చిరంజీవి తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తన సొంత నియోజకవర్గంలో పాటు తిరుపతిలో సైతం నామినేషన్ దాఖలు చేశారు. అయితే సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. తిరుపతిలో మాత్రం 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అక్కడ బలిజిలు అధికం. అప్పట్లో గుంప గుత్తిగా చిరంజీవికి ఆ సామాజిక వర్గం ఓట్లు పడడంతో విజయం సునాయాసం అయ్యింది. ఇప్పుడు సైతం పవన్ పోటీ చేస్తే ఏకపక్ష విజయం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన చదలవాడ కృష్ణమూర్తికి దాదాపు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. కరుణాకర్ రెడ్డి కేవలం ఎనిమిది వందల ఓట్లతో గెలవడం విశేషం. టిడిపి తో పొత్తు ఉన్న వేళ, సామాజిక సమీకరణలు, గత అనుభవాల దృష్ట్యా పవన్ తిరుపతి నుంచి బరిలో దిగితే భారీ మెజారిటీ దక్కడం ఖాయమని టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పవన్ వ్యూహం రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.