Daggubati Purandeswari: పురందేశ్వరిని తప్పిస్తారా? నిజమెంత?

పురందేశ్వరి వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. టిడిపి పై సానుకూలత చూపుతున్నారు. వైసీపీ సర్కార్ అవినీతి ఇది అంటూ మద్యం, ఇతరత్రా ఆదాయ వనరులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

Written By: Dharma, Updated On : October 11, 2023 3:43 pm

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని పక్కన పెడతారా? ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయా? ఆమె తెలుగుదేశం పార్టీ అజెండాతో పని చేస్తున్నారా? అందుకే ఆమెకు ఉద్వాసన తప్పదా?అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా పురందేశ్వరి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సీఎం జగన్, వైసిపి కీలక నేత విజయ సాయి రెడ్డి సైతం ఆమెనే టార్గెట్ చేయడంతో ఈ ప్రచారంపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.

ఏపీ బీజేపీ పగ్గాలు ఎక్కువ కాలం కమ్మ సామాజిక వర్గం చేతిలోనే నడిచాయి. వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబు తదితరులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. అప్పట్లో బీజేపీని టిడిపికి బీ టీమ్ గా నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హై కమాండ్ కమ్మ సామాజిక వర్గాన్ని తప్పించి.. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించింది. ఆయన సైతం టిడిపి స్టాండ్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అటు తర్వాత వచ్చిన సోము వీర్రాజు వైసిపికి అనుకూలంగా వ్యవహరించారన్న టాక్ నడిచింది. ఈ తరుణంలో తిరిగి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. వైసీపీ, టిడిపి లకు సమ దూరం పాటిస్తారని భావించారు. కానీ వారి అంచనాలకు తగ్గట్టుగా పురందేశ్వరి పని చేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

అయితే వస్తూ వస్తూ పురందేశ్వరి వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. టిడిపి పై సానుకూలత చూపుతున్నారు. వైసీపీ సర్కార్ అవినీతి ఇది అంటూ మద్యం, ఇతరత్రా ఆదాయ వనరులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వాటిపైనే కేంద్ర పెద్దలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా హోం మంత్రి అమిత్ షా ను కలిశారు. మద్యం ద్వారా జగన్ సర్కార్ ఏటా 25 వేల కోట్ల రూపాయలను కొల్లగొడుతుందని ఆరోపణలు చేశారు. అటు రాజకీయంగా కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే దీనిపై అమిత్ షా పురందేశ్వరికి క్లాస్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మీరు టిడిపితో అంటగాకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అవసరమైతే మార్పు చేస్తామని సైతం హెచ్చరికలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే వాస్తవాలను పరిశీలిస్తే పురందేశ్వరి మార్పు అంత ఈజీ కానట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలోనే తెలుగు రాష్ట్రాల నాయకత్వాలను తప్పించారు. తెలంగాణలో బండి సంజయ్, ఏపీలో సోము వీర్రాజును పక్కన పెట్టారు. పట్టుమని రెండు నెలల సమయం కాకుండానే తప్పించే అవకాశాలు లేనట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే బిజెపిలో అంతర్గత వివాదాలు చెలరేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తుందే తప్ప.. మార్పులకు ఇష్టపడదని బిజెపిలోని కొంతమంది చెబుతున్నారు. అదంతా వైసిపి సోషల్ మీడియా కట్టు కథ అని తేల్చేస్తున్నారు. ఇంకా పొత్తుల అంశం సజీవంగానే ఉందని.. ఏపీలో ఎన్నికల ముంగిట బిజెపి చాలా రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో?