TDP And Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. అయితే వచ్చే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అని అంతా భావించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ బరిలో కూడా ఉంటామని జనసేనాని ప్రకటించారు. ఈమేరకు 35 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జాబితా విడుదల చేశారు. దీంతో జనసేన–టీడీపీ కూటమికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి పరీక్ష ఎదురు కాబోతోంది. ఇక్కడ కనీసం పది సీట్లు నెగ్గినా.. 2024 ఎన్నికల ఫలితాలు వేరేగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో కూడా పొత్తు..
పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లు టీడీపీ–జనసేన పొత్తు తెలంగాణలో కూడా కొనసాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ తెలంగాణలో కనుమరుగైంది. దీనికి ఊపు తెచ్చేందుకు ఇటీవల చంద్రబాబు, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఖమ్మంలో సభ నిర్వహించారు. భారీగా క్యాడర్ తరలి వచ్చింది. దీంతో తెలంగాణలో లీడర్లు లేకపోయినా టీడీపీకి క్యాడర్ బలంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో జనసేన కూడా పోటీకి రెడీ అయింది. దీంతో టీడీపీ–జనసేన కలిసే పోటీ చేస్తాయని తెలుస్తోంది.
సీట్ల పంపకాలపైనే చిక్కుముడి..
జనసేనాని తెలంగాణలో పోటీచేసే 35 స్థానాలను ఇప్పటికే ప్రకటించారు. ఈ 35 నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉంది. ఒకప్పుడు కొన్ని స్థానాలు టీడీపీ కంచు కోటలు. ఈ క్రమంలో టీడీపీ–జనసేన పొత్తుగా బరిలో నిలిస్తే సీట్ల పంపకాలపై చిక్కుముడి పడే అవకాశం ఉంది. అయితే ఏపీ కోసం ఇక్కడ టీడీపీ, జనసేన సర్దుకుపోతాయని తెలుస్తోంది.
10 సీట్లు గెలిచిన భారీ విజయమే..
ఇక తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. జనసేనకు పవన్ కళ్యాణ్ చరిష్మా దోహదపడుతుంది. ఈ క్రమంలో 50 నుంచి వంద స్థానాల్లో రెండు కలిపి పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే అధికార బీఆర్‌ఎస్ ఓట్లు చీలడం కాయం. ఇక టీడీపీ–జనసేన కూటమి హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కొన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. మొత్తంగా తెలంగాణలో రెండు పార్టీలు కలిసి పది స్థానాల్లో గెలిచినా దాని ప్రభావం 2024లో జరిగే ఏపీ అసెంబ్లీతోపాటు, లోక్‌సభ ఎన్నికలపై పడుతుంది. ఇక్కడ పది సీట్లు గెలిస్తే దాని ప్రభావంతో ఏపీలో జనసేనకు ఎదురుగాలి తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.