రాష్ట్రంలోని 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజించి 25 జిల్లాల ఏర్పాటు చేసే విషయంపై స్వపక్షం నుంచి వస్తున్న అభ్యంతరాలను సైతం లెక్క చేయడకుండా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. గత నెల 15వ తేదీన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన ప్రభుత్వం జిల్లాల పునర్యవస్థీకరణకు చట్టపరమైన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ మేరకు కమిటీ నియమకానికి ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కమిటీకి ప్రధాన కార్యదర్శి ఛైర్సన్ గా, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. సిఎంఓ నుంచి ఒక ప్రతినిధి, సిసిఎల్ఎ, జిఎడి కార్యదదర్శి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి సభ్యులుగా వ్యవహరించనున్నారు.
Also Read: మళ్లీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనున్న జగన్ సర్కార్…!
ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి మూడు నెలలోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని స్వయంగా వైసీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను విభజన నుంచి మినహాయించాలని ఆ పార్టీ నాయకులు స్పీకర్ తమ్మినేని శీతారాం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. అరకు నియోజకవర్గం విభజనలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అనంతపురం, ప్రకాశం, కృష్ణా తదితర జిల్లాల్లో భౌగోళికంగా సమస్యలు ఉన్నాయి. హిందుపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాకుండా భౌగోళిక పరిస్థితిని బట్టీ జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్నాయి.
Also Read: ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుకే మొగ్గు చూపిస్తున్నారు. పార్టీ నాయకులు, మంత్రుల అభ్యంతరాలను సైతం ఆయన పక్కన పెట్టేయడంతో వైసీపీ నాయకులు ఈ విషయంలో మిన్నకుండి పోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన కమిటీకి ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు తమ విధానాన్ని వివరించే అవకాశం ఉంది. ఇందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కమిటీ జిల్లాల వారీగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం సేకరించనుందని సమాచారం.