
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఆంధ్రాలో కూడా అడుగుపెట్టింది. నెల్లూరులో తొలి పాజిటివ్ కేసు నమోదయిందని అధికారులు తెలిపారు. నెల్లూరుకు చెందిన ఒక యువకుడు ఇటీవల ఇటలీ నుంచి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి అతడికి దగ్గు, గొంతు నొప్పి ఉండడంతో బ్లడ్ శాంపిల్స్ ని తిరుపతి ల్యాబ్ లో పరీక్షించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఐతే ధృవీకరణ కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు రక్త నమూనాలను పంపించినట్లు తెలిపారు. ఆ రిపోర్టు కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఆ యువకుడు అప్పటికే మరో ఐదు మందిని కలిశాడని.. వారిని కూడా 14 రోజులపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు చేస్తామని తెలిపారు.
చైనా తర్వాత ఇటలీలోనే ఎక్కువ కరోనా మరణాలు నమోదవడంతో.. అనుమానించిన డాక్టర్లు జిల్లా ప్రభుత్వాస్పత్రికి పంపించారు. సోమవారం అతడిని పరీక్షించిన అనంతరం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స అందించారు. ఐతే ఇటీవల అతడి రక్త నమూనాలను తిరుపతి ల్యాబ్‌లో పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.
మన దేశంలో ఇప్పటి వరకు 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,169 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 4,638 మంది చనిపోగా, లక్షా 26వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆసుపత్రులలో ఉన్నారు.