
Kodali Nani : నన్నెవరు పడగొట్టేది.. నన్నెవరు ఓడించేది. గుడివాడ నా అడ్డ అంటూ విరవిహారం చేసేవారు గుడివాడ నాని. అబ్బా బాబులు ఇద్దరు కలిసొచ్చినా పర్వాలేదు. విడిగా వచ్చినా పర్వాలేదు అంటూ చంద్రబాబు, లోకేష్ లకు నిత్య సవాళ్లు విసురుతుంటారు. నా బోచ్చు అంటూ రోచ్చు మాటలు మాట్లాడుతుండేవారు. చంద్రబాబు, లోకేష్ లను మనుషులుగా కూడా అంగీకరించడానికి ఇష్టపడే వారు కాదు. వారిది ఒక బతుకేనా అంటూ ఎద్దేవా చేశారు. మధ్యలో పవన్ ను ఓ గడ్డిపూచ కింద లెక్కేసేవారు. కెసినో, పేకాట శిబిరాల ఆరోపణలు వచ్చినా వాటిని లైట్ తీసుకునేవారు. తన పంథాను కొనసాగించే వారు. అదే దూకుడు, అదే హాట్ కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి కొడాలి నానిలో సెడన్ చేంజ్ కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో వెనుకబడిన పోయిన వారి జాబితాలో నాని పేరు వచ్చేసరికి తెగ కంగారు పడిపోయారు. జగన్ హెచ్చరికలతో మరి భయాందోళన చెందారు. అందుకే ఇప్పుడు గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్ అంటూ ప్రజల బాట పడుతున్నారు.
మొన్న డ్రైవర్..
మొన్న ఆ మధ్యన ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తారు. కొత్త బస్సుల ప్రారంభోత్సవంలో నేరుగా బస్సు నడిపి ఆకట్టుకున్నారు. అక్కడకు నాలుగు రోజుల ముందే వర్కుషాపులో జగన్ నాని ప్రస్తావన తెచ్చారు. వెనుకబాటు జాబితాలో నువ్వు ఉన్నావు నాని అన్న అనేసరికి తెగ కంగారు పడిపోయారు. అర్జెంట్ గా ఏదో చేసేయ్యాలని తనకు తెలిసిన, పూర్వాశ్రమంలో అలవాటైన డ్రైవర్ అయితే జనాల్లో చాలా ఈజీగా వెళ్లవచ్చని భావించారు. అందుకే దాదాపు ఐదారు కిలోమీటర్లు బస్సును నడిపి గుడివాడ ప్రజలకు వినోదం పంచారు. తాను మాస్ కాదు.. ఊర మాస్ అని జనాలు గుర్తించేలా బహు బాగా నటించారు. తాను ఎక్కడా వెనుకబడలేదని.. గుడివాడలో తనదేనంటూ జగనన్నకు సంకేతాలు ఇచ్చారు.
నేడు టైలర్..
బస్సు డ్రైవరే అనుకుంటే ఇప్పుడు కొత్తగా టైలర్ అవతారమెత్తారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులను పలకరించారు. వలంటీర్లు, అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించాలంటూ అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టైలరింగ్ షాపు వద్ద ఆగారు. దర్జీతో మాట్లాడారు. టైలరింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. టైలరింగ్ మిషన్ వద్ద వెళ్లి కుట్టడం ప్రారంభించారు. అయితే దుస్తలు కాకుండా వెరైటీగా యూరియా సంచి కుట్టి ఆకట్టుకున్నారు. అయితే ఇంత బతుకు బతికి ఇదేంది నాని అన్న అంటూ సొంత పార్టీ శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎవరైనాఇటువంటి పనులు చేస్తే చిల్లరిమల్లరి పనులుగా చెప్పుకునే నానిలో సెడన్ చేంజ్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆ హెచ్చరికలతోనే..
జగన్ హెచ్చరికలే నానిలో మార్పునకు కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ నానిలాంటి హేమాహేమీలను చూసి పక్కనపడేశారు. నంబర్ 2లుగా ఉన్నవారినే ఫ్రీ ప్లాన్ గా తప్పించిన సందర్భాలున్నాయి. అటువంటిది కొడాలి నాని ఓ లెక్క అన్న కామెంట్స్ ఉన్నాయి. కొడాలి నాని హాట్ కామెంట్స్ పార్టీకి మేలు కంటే కీడే అధికంగా చేశాయని నివేదికలు వచ్చాయట. పైగా నియోజకవర్గంలో కూడా గతం కంటే నాని గ్రాఫ్ పడిపోయిందట. అటు టీడీపీ సైతం పుంజుకుందట. అందుకే జగన్ స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారుట. అందుకే కొడాలి నాని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారని వైసీపీలో ఒక టాక్ నడుస్తోంది. అందుకే ఫైర్ బ్రాండ్ గా ఉన్న నాని ఇలా డ్రైవర్, టైలర్ గా మారాల్సి వస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.