TDP: చంద్రబాబు రాజకీయ వ్యూహాలను అమలు చేయనున్నారు. దాదాపు మూడు నెలల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అవినీతి కేసుల్లో అరెస్టయి 53 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. ఆయనకు ముందుగా మధ్యంతర బెయిల్ లభించింది. అనంతరం రెగ్యులర్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 29 నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని సూచించింది. దీంతో పక్కా ప్రణాళికతో ఎన్నికల వ్యూహాలను చంద్రబాబు అమలు చేయనున్నారు. పార్టీ పరంగా నిలిచిపోయిన కార్యక్రమాలను కొనసాగించనున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈనెల 27న ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9న లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లో పాదయాత్ర నిలిచిపోయింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో లోకేష్ పాదయాత్ర తిరిగి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. కార్తీక సోమవారం పర్వదినాన ఉదయం 10: 27 నిమిషాలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. డిసెంబర్ నెలాఖరుకు యాత్ర పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. విశాఖ తో పాదయాత్ర ముగించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్ తయారు చేసే పనిలో టిడిపి నాయకులు ఉన్నారు.
అటు భువనేశ్వరి సంఘీభావ యాత్ర డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్థాపంతో మృతి చెందిన అభిమానుల కుటుంబాలను నిజం గెలవాలి పేరిట భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబుకు బెయిల్ లభించిన తర్వాత యాత్రలను నిలిపివేశారు. దీనిని కొనసాగించాలని తాజాగా నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా భువనేశ్వరి పర్యటనలు ఉండేలా టిడిపి ప్లాన్ చేస్తోంది. ఆమె పర్యటనలపై కూడా రూట్ మ్యాప్ ఖరారు అవుతుంది. వారానికి మూడు రోజులపాటు ఆమె పర్యటనలు కొనసాగనున్నాయి.
చంద్రబాబు సైతం ఎన్నికల ప్రణాళిక పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అటు జనసేనతో పొత్తుల వ్యవహారం, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన వంటి వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మధ్యంతర బెయిల్ ఆంక్షలు ఈనెల 28 వరకు కొనసాగుతాయి. అనంతరం చంద్రబాబు ప్రజల్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. సానుకూలంగా వస్తే చంద్రబాబు మరింత దూకుడుగా వ్యవహరించే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికైతే సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వెల్లివిరుస్తోంది.