సీఎం కేసీఆర్ కు ఎంతో ప్రియమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే పోరాటం మొదలుపెట్టారు. ఉద్యమాల ఖిల్లాలో పర్యటించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా అక్కడి నుంచే కేసీఆర్ పై యుద్ధం మొదలుపెట్టారు. సింగరేణి కార్మికులను ఒడిసిపట్టి కేసీఆర్ ను ఎండగట్టారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. సిరిసిల్లలో షర్మిలకు ఒక బహుమతిని చేనేత కార్మికులు ఇచ్చారు. అనంతరం కరీంనగర్ లో మధ్యాహ్నం భోజనం ముగించుకున్న షర్మిల సింగరేణి భూనిర్వాసితులతో మాట్లాడారు.
తెలంగాణలోని సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి భూనిర్వాసితులను ఆదుకోవడం లేదని ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని కోరారు.
ఇక ఆరోగ్యశ్రీని తెలంగాణ సర్కార్ సరిగ్గా అమలు చేయడం లేదని..ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రిక అయిన ఈ పథకాన్ని కేసీఆర్ సర్కార్ నీరుగారుస్తోందన్నారు.
ప్రధానంగా కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్న వర్గాలను వైఎస్ షర్మిల ఒడిసి పడుతున్నారు. వారితో సమావేశాలు, చర్చలు జరుపుతూ కేసీఆర్ తీరును ఎండగడుతున్నారు. ఓవైపు ఏపీతో కృష్ణానీటిపై కేసీఆర్, మంత్రులు పోటీపడుతుంటే వైఎస్ షర్మిల మాత్రం దక్షిణ తెలంగాణకు వెళ్లకుండా ఉత్తర తెలంగాణకు వచ్చి పర్యటిస్తూ వేరే సమస్యలు లేవనెత్తడం హాట్ టాపిక్ గా మారింది.