https://oktelugu.com/

Daspalla lands: దస్పల్లా భూముల కోసం వైసీపీలో ఆ ఇద్దరు అగ్రనేతల మధ్య ఫైట్

విజయసాయిరెడ్డి హయాంలో భూములు దక్కించుకున్న వారు ఫోర్జరీ సంతకాలు పెట్టారని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కానీ అందుకు వైజాగ్ పోలీస్ బాస్ ఒప్పుకోలేదు.

Written By:
  • Dharma
  • , Updated On : September 25, 2023 11:39 am
    Follow us on

    Daspalla lands: ఏపీ సీఎం జగన్ విజయదశమి నుంచి విశాఖలో పాలన ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు అక్కడ ప్రభుత్వ భూముల పంపకాల్లో వివాదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రభుత్వ పెద్దలు తలో దిక్కుగా ఉండడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు.. వారి మధ్య ఆధిపత్యానికి యంత్రాంగం మూల్యం చెల్లించుకుంటోంది. అయితే ఈ పంపకాల వివాదం ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కి చేరడం విశేషం. అక్కడి నుండి వచ్చే ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ లోకి దిగేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది.

    వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాధాన్యత ప్రాంతంగా మారిపోయింది. అందుకే ఏరి కోరి ఇక్కడ సమన్వయకర్త పోస్టు కోసం అధికార పార్టీలో పోటీ పెరిగింది. తొలుత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉండేవారు. తాజాగా వైవి సుబ్బారెడ్డి నియమితులయ్యారు. దీంతో ఉత్తరాంధ్ర ఓ సామంతరాజ్యంగా మారిపోయింది. విశాఖలో ప్రభుత్వ ఆస్తులపై ప్రభుత్వం పెద్దల కన్ను పడింది. ఎలాగైనా హస్తగతం చేసుకునేందుకు వారు పావులు కదపడం ప్రారంభించారు. ప్రధానంగా దస్పల్లా భూముల పంపకంలో విజయసాయి రెడ్డికి, వై వి సుబ్బారెడ్డి మధ్య పెద్ద రచ్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇది ప్రభుత్వానికి చెందిన భూమి. కానీ రాణి వారసులమని చెప్పి విలువైన భూమిని కొట్టేశారు. అప్పట్లో విజయ్ సాయి రెడ్డి చెప్పినవారికి భూములు దక్కాయి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సైతం కొంతమందికి సిఫార్సు చేస్తున్నారు. దీంతో కొత్త, పాత వారి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అవి పెద్ద రెడ్ల వద్దకు చేరుతున్నాయి.

    విజయసాయిరెడ్డి హయాంలో భూములు దక్కించుకున్న వారు ఫోర్జరీ సంతకాలు పెట్టారని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కానీ అందుకు వైజాగ్ పోలీస్ బాస్ ఒప్పుకోలేదు. దానికి ఆయన బదిలీతో మూల్యం చెల్లించుకున్నారు. అది ఈ నోటపాకి తాడేపల్లి చేరింది. కానీ అక్కడి పెద్దలు ఏమీ తేల్చలేకపోతున్నారు. దీంతో వివాదం అలానే ఉండిపోయింది. కానీ ఆ ఇద్దరి నేతలతో పాటు వారి అనుచరుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది.

    విజయదశమి నుంచి విశాఖ నుంచే పాలన అంటూ జగన్ ప్రకటించారు. దీంతో సాగర నగరవాసులు సంబరాల్లో మునిగిపోలేదు. స్వాగత కార్యక్రమాలు ఏవి చేపట్టలేదు. కానీ విశాఖ వైసీపీ నేతలు మాత్రం హడావిడి చేస్తున్నారు. విశాఖ వందనం పేరిట భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణ నగరంగా ఉన్నప్పుడే వైసిపి నేతల భూదందాలపై పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చాయి. సామాన్య జనాలు సైతం బాధితులుగా మారారు. ఎంపీ లాంటి కుటుంబ సభ్యులే కిడ్నాప్నకు గురయ్యారు. ఇప్పుడు ఇద్దరు బడా నేతల మధ్య జరుగుతున్న భూ ఆధిపత్యం ఎటు దారితీస్తుందోనన్న టాక్ నడుస్తోంది. ఇక పూర్తిస్థాయిలో విజయదశమి నుంచి ఎంటర్ అయ్యాక పరిస్థితి ఎలా మారుతుందోనన్న బెంగ వారిని వెంటాడుతోంది.