Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభమై దశాబ్దాలు దాటింది. ఇవ్వాల్టి వరకు కూడా ఏ ఒక్క ఖాతాదారు కూడా మార్గదర్శి యాజమాన్యం మీద ఫిర్యాదు చేయలేదు. తనకు సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించలేదు. అంటే ఎలాగూ ఆరోపణలు రావడం లేదు కాబట్టి మార్గదర్శి సంస్థ సుద్ధ పూస అనుకుంటే పొరపాటే. ఖాతాదారుల నుంచి ప్రతి నెలా వసూలు చేసే చిట్స్ విషయం దగ్గర నుంచి మొదలుపెడితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వరకు ప్రతి విషయంలోనూ మార్గదర్శి యాజమాన్యం తప్పటడుగులు వేసింది. వాస్తవానికి తమ మీద ఎటువంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి, తాము అన్ని సక్రమంగానే చేస్తున్నామని మార్గదర్శి చెప్పుకుంటున్నది. అంటే ఎటువంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి గొప్ప కంపెనీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే సత్యం రామలింగరాజు, అగ్రిగోల్డ్ వంటి సంస్థల మీద ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. కానీ వాటిల్లో జరిగిన ఆర్థిక అవకతవకలు కార్పొరేట్ ప్రపంచానికి ఒక గుణపాఠం చెప్పాయి. తనంతట తాను చెప్పేదాకా సత్యం కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని స్థాయిలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఉంది. ఇక ఇదే వరుసలో అగ్రిగోల్డ్ కూడా ఉంది.
వాస్తవానికి ఖాతాదారులకు ఇప్పటికీ కూడా మార్గదర్శి మీద నమ్మకం ఉంది. కానీ అది ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చు అనే భయం ప్రభుత్వంలో ఉంది. గత పరిణామాలు కూడా ఇలాంటి పాఠాన్ని చెప్పడంతో ప్రభుత్వం మార్గదర్శిని తవ్వే పనిలో పడింది. అంటే దీనిపై ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ జగన్ వెనుకడుగు వేయడు. వెనకడుగు వేస్తే అతడు జగన్ ఎందుకు అవుతాడు? మార్గదర్శకి సంబంధించి ఖాతాదారుల నుంచి వసూలు చేసిన చిట్స్ హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ కి వెళ్తున్నాయి. అక్కడి నుంచి అవి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా వెళుతున్నాయి. వాస్తవానికి ఖాతాదారులకు తెలియకుండా వారి సొమ్మును ఎందులోనూ పెట్టుబడి పెట్టే అధికారం ఏ సంస్థకూ లేదు. కానీ ఈ విషయంలో మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇలా ఏకంగా ఖాతాదారుల నుంచి 800 కోట్లు వసూలు చేసింది.
వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి విచారణ తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరగాలని అక్కడి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. కానీ సెంట్రల్ కార్యాలయం హైదరాబాదులో ఉన్నందున విచారణ ఇక్కడే జరగాలని తెలంగాణ హైకోర్టు కోరుతోంది. అయితే తెలంగాణ హైకోర్టులో కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరపాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బహుశా ఆగస్టు నెలలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనిని విచారణకు తీసుకోకూడదని ఇప్పటికే రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కాని.. ప్రస్తుతానికైతే మార్గదర్శి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అయితే సుప్రీంకోర్టులో కేసు త్వరగా విచారణకు వచ్చేలా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఈ కేసు ఏపీ ప్రభుత్వం పరిధిలోని విచారించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రామోజీరావు జగన్ చేతికి చిక్కినట్టే. ఒకవేళ ఈ కేసు హైదరాబాదులోనే విచారణ జరగాలంటే జగన్ ఒక అడుగు వెనక్కి వేసినట్టు లెక్క. ఎందుకంటే రకరకాల కారణాలు చూపించి కేసును పొడిగించాలని రామోజీరావు ఆలోచనగా ఉంది. అందుకే తాను చేస్తున్న వ్యాపారం మొత్తం సక్రమమేనని రామోజీరావు చెబుతున్నారు. ఇలా మార్గదర్శి విషయంలో అటు ప్రభుత్వం, ఇటు రామోజీరావు.. ఎవరి వాదన వారికి ఉండడంతో కోర్టులు కూడా ఎటూ చెప్పలేకపోతున్నాయి.