https://oktelugu.com/

TRS vs BJP: కేసీఆర్ కు షాక్.. బీజేపీ ప్రతిఘటన.. రక్తికడుతున్న తెలంగాణ రాజకీయం

TRS vs BJP:  ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..’ అన్న చందలా మారింది టీఆర్ఎస్ పరిస్థితి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని ఎంత అణచాలని చూస్తే అంతకంతకు పాపులారిటీ సాధిస్తోంది. ఇక్కడి బీజేపీకి చెక్ పెట్టాలని కేసీఆర్ పన్నిన వ్యూహం కమలం పార్టీ నాయకులకు ప్లస్ అవుతోందని అనుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్టు చేసి వారి నోరు మూయించాలని కేసీఆర్ భావించారు. బండిని అరెస్ట్ చేస్తే కింది స్థాయి నాయకులతో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2022 / 08:42 AM IST
    Follow us on

    TRS vs BJP:  ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..’ అన్న చందలా మారింది టీఆర్ఎస్ పరిస్థితి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని ఎంత అణచాలని చూస్తే అంతకంతకు పాపులారిటీ సాధిస్తోంది. ఇక్కడి బీజేపీకి చెక్ పెట్టాలని కేసీఆర్ పన్నిన వ్యూహం కమలం పార్టీ నాయకులకు ప్లస్ అవుతోందని అనుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్టు చేసి వారి నోరు మూయించాలని కేసీఆర్ భావించారు. బండిని అరెస్ట్ చేస్తే కింది స్థాయి నాయకులతో సహా పార్టీలో ఆ ఊపు తగ్గుతుందని అంచనావేశారు. ఇక ఎవరూ నోరెత్తరని ఊహించాడు.  కానీ కేసీఆర్ ఊహించని విధంగా బండి సంజయ్ అరెస్టు కేంద్రంలోని బీజేపీ పెద్దలను కదిలించింది. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తెలంగాణకు రప్పించేలా చేసింది. కేంద్రమంత్రులు కదిలివస్తున్నారు. బండి సంజయ్ కు అండగా ఢిల్లీ పెద్దలు కదిలిరావడంతో కేసీఆర్ వ్యూహం ఫెయిల్ అయ్యి ఇప్పుడు డిఫెన్స్ లో పడినట్టైంది.

    jp nadda1 kcr

    తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం ‘ఇంతింతై వటుడింతై’ అన్న రేంజ్లో సాగుతోంది. రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టాలని కేసీఆర్ పన్నిన వ్యూహం ఎదురు దెబ్బ తగిలినట్లైందని చర్చించుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్ ను అరెస్టు చేయడంతో కేంద్ర పెద్దలంతా వెంటనే స్పందించారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సైతం బండి సంజయ్ అరెస్టుకు నిరసన తెలపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో రద్దు చేయాలని ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘జారగణ దీక్ష’ చేయాలని సంకల్పించారు. అయితే కొవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు.  ఈ దీక్ష చేసేందుకు బండి సంజయ్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని, తమకు తెలిపి ఉంటే ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చేవాళ్లమని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కరోనా నిబంధనలు ఉల్లంఘించారని బండి సంజయ్ ను అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

    అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న సంజయ్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులేసుకున్నారు. కానీ పోలీసులు ఇనుప రాడ్లను ఉపయోగించి.. వాటర్ క్యాన్లను ప్రయోగించారు. మొత్తానికి  తలుపులు బద్దలుకొట్టి మరీ పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. ఆ తరువాత కోర్టులో హాజరు పరిచడంతో ఆయనకు బెయిల్ లభించలేదు. అయితే ఈ వ్యవహారం తీవ్ర సంచలనమైంది. బీజేపీ అధ్యక్షుడినే అరెస్ట్ చేస్తారా? అని బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది. ఇక తన హక్కులు ఉల్లంఘనపై ఎంపీ బండి సంజయ్ సైతం పార్లమెంట్ కు ఫిర్యాదు చేశారు.

    ఈ వ్యవహారమంతా గమనిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. ఏకంగా హైదరాబాద్ లో నిరసన ర్యాలీ తీశారు. మరోవైపు అమిత్ షా సైతం స్పందించి కేసులకు భయపడొద్దని ఆవన్నీ తాము చూసుకుంటామని అభయం ఇచ్చినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. లోక్ సభ స్పీకర్ సైతం ఎంపీ ఫిర్యాదును స్వీకరించి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో బండి సంజయ్ కు కేంద్ర ఫుల్ సపోర్టు ఇచ్చినట్టైంది.

    ఈ పరిస్థితిని గమనిస్తున్న కేసీఆర్ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారు. వాస్తవానికి ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినా.. బండి సంజయ్ అరెస్టు కావడంతో మొత్తం టీఆర్ఎస్ పై యుద్ధాన్ని ప్రకటించిన నిరసన తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నిరసన తెలపడంతో సంచలనమైంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు జేపీ నడ్డా ప్రెస్ మీట్ లో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై కేసీఆరే రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    తెలంగాణలో మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని బీజేపీ చేస్తున్న ప్లాన్లు ఫలిస్తున్నాయి. రెండు సార్లు గెలిచిన టీఆర్ఎస్ మూడో సారి గెలిచే అవకాశం లేదు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కాంగ్రెస్ ను మూడోస్థానంలోకి నెట్టి తెలంగాణలో సొంతంగా అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తీవ్ర ప్రభావంచూపే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై బండి సంజయ్ పోరుబాటపట్టారు. అది ఆయన అరెస్ట్ తో బీజేపీకి బోలెడంత మైలేజ్ వచ్చింది. వచ్చే ఏడాదే ఎన్నికలు కావడంతో ఇప్పుడు బీజేపీ ప్లాన్లు ఫలించి తెలంగాణలో రాజకీయం రక్తికడుతోంది. అది ప్రజల్లో బీజేపీకి బోలెడంత సింపతీ తెచ్చిపెడుతోంది. అదే తమకు అధికారాన్ని సాధించిపెడుతుందని బీజేపీ నమ్మకంగా ఉంది.