హైదరాబాద్ లో ఈ జ్వరం సర్వే మే 3వ తేదీన మొదలైంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ నర్సు, ఆశా కార్యకర్తలు, గ్రేటర్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఈ సర్వే మొదలు పెట్టాయి. మొత్తం 1700 బృందాలు ఈ సర్వే కోసం పనిచేస్తున్నాయి. మే 16వ తేదీ నాటికి 8.6 లక్షల ఇళ్లను ఈ బృందాలు చుట్టేశాయి.
అయితే.. 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇక, మధ్య వయస్కుల్లో ఈ తీవ్రత కాస్త తక్కువగానే ఉందని, యువతలో మాత్రం ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది సర్వే. ఇలా బాధపడుతున్న వారిలో తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి కొవిడ్ కిట్ ను అందజేస్తున్నారు. అలాంటి వారి వివరాలు సేకరించి, వైద్యులు ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటున్నట్టు సమాచారం.
కాగా.. హోం ఐసోలేషన్లో ఉన్న కొవిడ్ బాధితుల్లో కొందరు కాస్త ఓపిక వచ్చిన తర్వాత బయట తిరుగుతున్నట్టుగా సర్వే బృందాలు గుర్తించాయి. ఇలాంటి వారు.. ఇంటిపట్టునే ఉండాలని, బయటకు వెళ్లి ఇతరులకు వైరస్ అంటిచొద్దని సూచిస్తున్నాయి.
ఈ నెల 16 వరకు కొనసాగించిన సర్వేను పరిశీలిస్తే.. బృందాలు 8 లక్షల 59 వేల 971 ఇళ్లను పరిశీలించాయి. ఈ ఇళ్లలో కరోనా లక్షణాలు ఉన్నవారు 21 వేల మందికి పైగా ఉన్నారు. జ్వర బాధితులు 31,387 మంది ఉన్నారు. వీరందరికీ కొవిడ్ కిట్లు అందించారు. సర్వే మొత్తం ముగిస్తే.. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందువల్ల జనాలు అనవసరంగా బయటకు రావొద్దని, వైరస్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.