NEET UG 2023 Updates : లేటు వయసులో ఘాటు కోరిక.. కూతురుతో కలిసి నీట్ పరీక్ష రాసిన 49 ఏళ్ల తండ్రి

ఖమ్మం ప్రాంతానికి చెందిన సతీష్ బాబు. చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలనే తన కలను 49 ఏళ్ల వయసులో నెరవేర్చుకునేందుకు 17 ఏళ్ల కుమార్తెతో కలిసి నీట్ పరీక్ష రాశారు.

Written By: NARESH, Updated On : May 7, 2023 6:41 pm

Father daughter

Follow us on

NEET UG 2023 Updates : చదువుకోవాలన్న తపనే ఉండాలే గానీ వయసు అడ్డం కాదని ఎంతో మంది నిరూపించారు. వృద్ధాప్యంలో కూడా పీహెచ్డీలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పిల్లలతోపాటు తరగతి గదులకు వెళ్లి చదువుతున్న తల్లిదండ్రులు కూడా కొందరు ఉన్నారు. అదే కోవకు చెందుతారు ఖమ్మం ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల సతీష్ బాబు. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు కూతురితో కలిసి హాజరై అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ వయసులో నీట్ పరీక్ష ఎలా రాయగలిగారు..? ఈ వయసులో ఎందుకు రాశారో మీరూ చదివేయండి.

చదువుకు వయసు అడ్డం కాదు. తన లక్ష్యాలు వేరేగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు.. ఆర్థిక అవసరాలు ఎంతో మందిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లేలా చేస్తుంటాయి. ఒక వయసు దాటాక, ఆర్థిక స్థితిగతులు కుదుటపడ్డాక నెరవేరని తమ కలలను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు కొందరు. మరి కొందరు తమ తీరని కలలను బిడ్డలు ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, ఈ రెండు చేస్తున్నారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన సతీష్ బాబు. చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలనే తన కలను 49 ఏళ్ల వయసులో నెరవేర్చుకునేందుకు 17 ఏళ్ల కుమార్తెతో కలిసి నీట్ పరీక్ష రాశారు.

ఇద్దరూ కలిసి పరీక్షకు హాజరు..

తండ్రి, కూతురు ఒకే పరీక్షకు హాజరు కావడం అరుదుగా చూస్తుంటాం. అటువంటి అరుదైన పనిని చేశారు ఈయన. చిన్నప్పటి నుంచి వైద్య వృత్తిలోకి వెళ్లాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఆదివారం దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు కూతురితో కలిసి సతీష్ బాబు హాజరయ్యారు. ఖమ్మం నగరంలోనే ఓ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు సతీష్ బాబు. మెడిసిన్ చదవాలని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దూరంగా ఉండిపోయారు. కుటుంబ అవసరాల దృష్ట్యా 1997లో బీటెక్ పూర్తి చేసిన ఆయన.. ఆ తర్వాత నుంచి కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తన కోరికను పిల్లలకు చెప్పి వారు ఆ దిశగా వెళ్లేలా చేశారు.

వయోపరిమితిని ఎత్తేయడంతో అవకాశం..

నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నీట్ అర్హత కోసం వయోపరిమితిని ఎత్తివేయడంతో సతీష్ బాబుకు కలిసి వచ్చింది. ఇన్నాళ్లు తన నెరవేరని కోరికగా భావిస్తూ వచ్చిన.. వైద్యుడు కావాలన్న ఆకాంక్షను తీర్చుకునే గొప్ప అవకాశం లభించడంతో ఆయన ఆనందానికి హద్దే లేకుండా పోయింది. చిన్నప్పటి నుంచి తనలోనే దాచుకున్న ఆశలు మరోసారి చిగురించాయి. వయసు పెరిగినా తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్న ఆయన నీట్ రాసేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగానే పరీక్షకు సిద్ధమయ్యారు.

తన కలను కూతుళ్ళతో నెరవేర్చుకోవాలని..

వైద్య వృత్తిలో స్థిరపడాలన్న తన కలను కూతురితో సాకారం చేసుకోవాలని భావించారు సతీష్ బాబు. అందుకు అనుగుణంగానే కుమార్తెలకు చిన్నప్పటి నుంచి వైద్యులు కావాలని, అది నీ తండ్రి కల అని చెబుతూ వచ్చారు. ఇప్పటికీ పెద్ద కుమార్తె ఆ దిశగా వెళ్లేలా చేశారు సతీష్. అయితే, అనుకోకుండా నీట్ పరీక్ష రాసేందుకు వయో పరిమితిని ఎత్తివేయడంతో సతీష్ బాబు కూడా వైద్య వృత్తిలో చేరే అవకాశం లభించింది. దీంతో కుమార్తెతో కలిసి పరీక్ష రాసేందుకు ప్రిపరేషన్ ను ప్రారంభించారు. ఆదివారం కూతురితో కలిసి పరీక్ష రాశారు.

ప్రత్యేక అనుమతి పొందిన సతీష్ బాబు..

సతీష్ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కోర్సు చేశారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా ఎంపీసీ చేసి బీటెక్ పూర్తి చేశారు. అయితే, నీట్ రాయాలి అంటే జీవశాస్త్రం అవసరం కాబట్టి ఇంటర్ లో జువాలజీ, బోటనీ సబ్జెక్టులను రాసేందుకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం జువాలజీ, బోటనీ పరీక్షలను రాశారు. వాటి ఫలితాల కోసం ప్రస్తుతం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ పరీక్షల్లో పాస్ కావడంతోపాటు నీట్ కూడా క్రాక్ చేస్తానని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.

నిరుపేదలకు వైద్యం అందించడమే లక్ష్యం..

పరీక్ష రాసిన అనంతరం సతీష్ బాబు మాట్లాడుతూ.. తాను ఎలాగైనా ఎంబిబిఎస్ పూర్తి చేసి హాస్పిటల్ కడతానని, పేదలకు వైద్యం అందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఈ ప్రయత్నంలో నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా యువతకు స్ఫూర్తిగా నిలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది నీట్ లో పాస్ అవ్వకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్ళీ రాస్తానని వెల్లడించారు. తన తండ్రితో కలిసి నీటి పరీక్షకు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని సతీష్ బాబు కుమార్తె జోషికా స్వప్నిక పేర్కొన్నారు. కాగా సతీష్ బాబు పెద్ద కుమార్తె సాత్విక ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో బిడిఎస్ చదువుతోంది. ఏది ఏమైనా తన నెరవేరని కలను కుమార్తెలతో నెరవేర్చుకునే ప్రయత్నం చేయడంతో పాటు.. కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్న సతీష్ బాబును పలువురు అభినందిస్తున్నారు.