
Maharashtra: మహారాష్ట్ర రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లిగడ్డలను ప్రధాని నరేంద్రమోదీకి పార్సిల్ పంపారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర దొరకటం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవల ఓ రైతు 500 కిలోల ఉల్లి అమ్మితే వ్యాపారి ఖర్చులన్నీ పోనూ రూ.2 కు చెక్కు ఇచ్చాడు. ఇలాంటి దీన పరిస్థితిలో తమ మొర ఆలకించాలని ప్రధానికి ఉల్లిగడ్డలు పార్సిల్ చేసి నిరసన తెలిపారు.
ఉల్లి రైతుల ‘మహా’ కష్టాలు
రైతులకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. కష్టమైనా.. నష్టమైనా భూమాతనే నమ్ముకుంటారు. ముంచినా తేల్చినా నీవే తల్లి అంటూ వ్యవసాయం చేస్తారు. మహారాష్ట్ర రైతులు అప్పులు చేసి ఉల్లి సాగుచేశారు. దిగుబడి బాగానే వచ్చింది. మంచి లాభాలు వస్తాయని ఆశించారు రైతులు. కానీ మార్కెట్‌లో ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాని తీరు రైతులను ఆవేదనకు గురిచేస్తుంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో వాటిని అమ్మలేక నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో రైతులు తమ పరిస్థితి ప్రధాని నరేంద్ర మోడీకి తెలియాలని భావించారు.
కిలో కేవలం రెండు రూపాయలే..
దేశంలో ఉపయోగించే ఉల్లిలో ఎక్కువశాతం మహారాష్ట్రలో పండిస్తారు. అయితే ఇక్కడ రైతులు పండించిన ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర పలకకపోవడంతో రైతులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు నరకం చూస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి ధరలు కేవలం రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. ఇలా అయితే పెళ్లాం పిల్లలను ఎలా పోషించుకోవాలని, చేసిన అప్పులు ఎలా తీర్చాలని ప్రశ్నిస్తున్నారు.
మరో దారిలేక మోదీకి పార్సిల్..
స్థానిక ప్రభుత్వం మద్దతు ధర పెంపుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆందోళనలు, నిరసనలు తెలిపినా ఫలితం శూన్యం. దీంతో విసిగిపోయిన రైతులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఉల్లిగడ్డలను పార్సిల్‌గా పంపారు. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు తీవ్రంగా పతనం కావడంతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు.
ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని..
కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పండిన పంట అమ్ముకుందామంటే ఇక్కడ గిట్టుబాటు ధర లేదని, కనీసం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అయినా తమకు ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి ఉల్లిగడ్డలు పార్సిల్ పంపించి తమ గోడు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశామని చెబుతున్నారు.
మరి ఉల్లి రైతుల మొర ప్రధానికి ముడుతుందో.. ఆయన ఉల్లి రైతుల కష్టాలను చూసి ఏ విధంగా స్పందిస్తారో.. ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తారా లేదా అనేది చూడాలి.