ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

( నిన్నటి భాగం తరువాయి ) సోము వీర్రాజు నియామకం ఆంధ్రా లో మూడో ప్రత్యామ్నాయానికి బాటలు వేయాలంటే కొన్ని నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సి వుంది. నిన్న చర్చించుకున్నట్లు ఈ నియామకం కాపు సామాజిక వర్గంలో కొంత కదలిక వచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఇది ఒక్కటే మూడో ప్రత్యామ్నాయానికి, అధికారంలోకి రావటానికి సరిపోవు. గత ప్రజారాజ్యం అనుభవం చూసినా ఇది అవగతమవుతుంది. సామాజిక సమీకరణలు కొంతమేరకే ఉపయోగపడతాయి. అదీ ఒక్క సామాజిక వర్గంతో కాదు. పలు […]

Written By: Ram, Updated On : July 30, 2020 11:59 am
Follow us on

( నిన్నటి భాగం తరువాయి )

సోము వీర్రాజు నియామకం ఆంధ్రా లో మూడో ప్రత్యామ్నాయానికి బాటలు వేయాలంటే కొన్ని నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సి వుంది. నిన్న చర్చించుకున్నట్లు ఈ నియామకం కాపు సామాజిక వర్గంలో కొంత కదలిక వచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఇది ఒక్కటే మూడో ప్రత్యామ్నాయానికి, అధికారంలోకి రావటానికి సరిపోవు. గత ప్రజారాజ్యం అనుభవం చూసినా ఇది అవగతమవుతుంది. సామాజిక సమీకరణలు కొంతమేరకే ఉపయోగపడతాయి. అదీ ఒక్క సామాజిక వర్గంతో కాదు. పలు సామాజిక వర్గాల కూర్పు జరగాలి. దానితోపాటు ప్రత్యమ్నాయ విధానం, పటిష్ట నిర్మాణం జరిగినప్పుడే ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. కాబట్టి ఏ ఒక్క కారణం పై ఆధారపడి ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ఆంధ్రా లో వున్న సామాజిక , ఆర్ధిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఓ పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. అవేమిటో స్థూలంగా ఒక్క సారి పరిశీలిద్దాం.

Also Read: సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?

ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్ధిక విధానం 

జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం తీసుకోనన్ని సంక్షేమ పధకాలు తీసుకొచ్చాడు. ఈ విషయం లో తండ్రి కన్నా నాలుగాకులు ఎక్కువే చదివాడు. దానితోపాటు గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలు, పాఠశాలల్లో మౌలిక వసతులు , మద్యపాన నియంత్రణ లతో తనదైన ముద్ర వేసాడు. వీటికి దీటుగా ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల్ని రూపొందించాల్సి వుంది. ఇది మేధావులు, నాయకత్వం కలిసి సంయుక్తంగా రూపొందించాల్సి వుంది. ఇక రాజకీయ విధానం గురించి జగన్ కన్నా బిజెపి-జనసేన కి ప్లస్ పాయింటే వుంది. ఎందుకంటే బిజెపి దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కాబట్టి విధానాల్లో స్పష్టత వుంటుంది. జనసేన తో కలిసి ఆంధ్రా కి సంబంధించిన నిర్దిష్ట అంశాలను జతచేసి రాజకీయ విధానం రూపొందించు కోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఇందులో బిజెపి కి విస్తృత రాజకీయ అనుభవముంది. నా దృష్టి లో మిగతా అన్ని అంశాల కన్నా ఈ ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్ధిక విధానమే ప్రధానమైనది. దీని ద్వారానే ప్రజల్లో ప్రత్యామ్నాయ ఆలోచన దిశగా మార్పు తీసుకు రావచ్చు.

సామాజిక సమీకరణలు 

రెండో అత్యంత ప్రాధాన్య అంశం సామాజిక సమీకరణాల కూర్పు. ఈ విషయం లో ఇప్పటికే జగన్ పటిష్టమైన కూర్పు ని కలిగి వున్నాడు. ఈ రాష్ట్రం లో రెడ్డి సామాజిక వర్గం సమాజంలో అత్యంత ప్రభావమైన వర్గం. గ్రామాల్లో ఇప్పటికీ వీరి ప్రభావం మిగతా వర్గాల పై అధికంగా వుంది. దానితోపాటు దళితులు నూటికి తొంభై శాతం జగన్ వైపే వున్నారు. దీన్ని సడలించటం ఇప్పట్లో జరిగే పని కాదు. ఈ రెండు సామాజిక వర్గాల కూర్పు జగన్ కి కోర్ బేస్. 2019 ఎన్నికల్లో ఈ కోర్ బేస్ తో పాటు మిగతా వర్గాలు కూడా ( ఒక్క కమ్మ సామాజిక వర్గం తప్ప ) జగన్ వైపే మొగ్గు చూపాయి. అందుకే అత్యధిక మెజారిటీ తో గెలుపొందగాలిగాడు. ఈ మూడో ప్రత్యామ్నాయం చేయవలసిందల్లా కాపు సామాజిక వర్గం కోర్ బేస్ తో పాటు జగన్ కోర్ బేస్ ని మినహాయించి మిగతా సామాజిక వర్గాల సమీకరణ. బిసి వర్గాలు, అగ్రవర్ణాల్లో ఎన్ని సెక్షన్లను సమీకరించుకోగలిగితే అంతగా అధికారానికి చేరువవుతారు. ఈ విషయంలో ప్రజారాజ్య గుణపాఠం  తో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాపు సామాజిక వర్గం అతి స్పందన వలన మిగతా సామాజిక వర్గాలు రెండో వైపు సమీకరించబడ్డారు. సహజంగా కాపు సామాజిక వర్గం ఉద్రేక స్వభావం గలవాళ్ళు అవటంతో మిగతా వర్గాలు దూరం అవటానికి కారణ భూతమవుతుంది. ఈ విషయం లో ఇప్పటినుంచే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజారాజ్య అనుభవం పునరావృతమయ్యే అవకాశముంది. ముఖ్యంగా బిసి సామాజిక వర్గ సమీకరణ కోసం ప్రత్యేక కృషి చేయాల్సి వుంది.

ఆంధ్రలో మత కోణం 

ఆంధ్ర ప్రదేశ్ లో క్రైస్తవ మత విస్తరణ చాప కింద నీరులా జరిగిపోతూ వుంది. ఇది బ్రిటిష్ కాలం నుంచీ జరుగుతూనే వుంది. వై ఎస్ ఆర్ కుటుంబం పేరుకు రెడ్డి సామాజిక వర్గమైనా క్రైస్తవ కుటుంబమే. ఇడుపులపాయ లో వై ఎస్ ఆర్ సమాధి దగ్గర కేవలం బైబిల్ సూక్తులే వుంటాయి. హిందూ ధర్మ ఆనవాళ్ళు మచ్చుకు కూడా కనిపించవు. వై ఎస్ ఆర్ సతీమణి విజయలక్ష్మి బైబిల్ చేతపట్టుకునే ఎన్నికల ప్రచారం చేసింది. షర్మిలా భర్త అనిల్ ప్రతిరోజూ ఉదయం సాక్షి టివి లో క్రైస్తవ బోధనలు ప్రచారం చేస్తాడు. రెండోవైపు హిందూ ధర్మం లోని రెడ్డి సామాజిక వర్గం జగన్ ని తమవాడుగా భావిస్తారు. అంటే మతంకన్నా కుల ప్రభావం అధికంగా ఉందన్నమాట.

రెండో వైపు చూస్తే క్రైస్తవ మత ప్రచారం ఆంధ్ర లో చాలా లోతుగా జరుగుతుంది. ఒకనాడు క్రైస్తవం దళితులందర్నీ ఆకర్షిస్తే గత రెండు మూడు దశాబ్దాలలో ఉత్తరాంధ్ర మన్య ప్రాంతం లోని గిరిజనులందరూ క్రైస్తవం లోకి మారిపోయారు. ఆంధ్రాలోని గ్రామాల్లో ఇప్పటికీ క్రైస్తవ ప్రచారం రోజు రోజుకీ విస్తృత మవుతుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువయ్యిందని వినికిడి. చివరకి హిందూ పుణ్య క్షేత్రల్లోకి కూడా పాకిందని వార్తలు వస్తున్నాయి. అధికారిక జనాభా లెక్కల ప్రకారం 2 శాతం కూడా క్రైస్తవులు లేరు. కానీ వాస్తవానికి దాదాపు 15 నుంచి 20 శాతం మధ్యలో క్రైస్తవ జనాభా ఉండొచ్చునని అంచనా. ఈ అంశం కూడా ఆంధ్రా వరకు ప్రచారాస్త్రం గా ఉపయోగించుకోవచ్చు.

మీడియా పై దృష్టి 

ఆంధ్రలో పత్రికలూ, టివీలు ప్రధానంగా ఒకే సామాజిక వర్గానికి చెందినవి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎన్ టి ఆర్ నుంచి పదవిని లాక్కోవటంలో  ఓ పత్రిక పాత్ర అందరికీ తెలిసిందే. పత్రికల, టివి ల ప్రాధాన్యతని గుర్తించే వై రాజశేఖర రెడ్డి సాక్షి పత్రికని, చానల్ని ప్రారంభించాడు. అదే ఒరవడి లో కెసిఆర్ నమస్తే తెలంగాణా పత్రికని, టి న్యూస్ చానల్ని పెట్టాడు. కాబట్టి మీడియా కూడా ప్రత్యామ్నాయ ప్రచారానికి చాలా అవసరం. ఇక్కడా మనకి ప్రజారాజ్యం అనుభవం అక్కరకొస్తుంది. ప్రజారాజ్యం చేసిన తప్పుల కన్నా వాటిని ప్రజల్లోకి గోరింతలు కొండింతలు చేసి తెసుకేల్లిన తీరు అందరికీ తెలిసిందే. ఈ అనుభవాల దృష్ట్యా మూడో ప్రత్యామ్నాయాన్ని ప్రచారం చేసే పత్రిక, చానలు అవసరం ఎంతయినా వుంది. ఇప్పటికే 99 టివి , V6 చానళ్ళు కొంతమేర ఆ కొరతను తీర్చే అవకాశమున్నా పత్రిక అవసరం చాలా వుంది. కాబట్టి మీడియా కూడా ఓ ముఖ్యమైన అంశమే.

బిజెపి-జనసేన ఐక్య కూటమి 

ఆంధ్రలో బిజెపి కి ప్రజాదరణ లేదు, జనసేన కు నిర్మాణ స్వరూపం లేదు. కానీ బిజెపి కి మోడీ ఇమేజ్, జనసేన కు పవన్ కళ్యాణ్ మాస్ అప్పీల్ వున్నాయి. అదే సందర్భంలో బిజెపి కి మిగతా రాష్ట్రాలంత విస్తారంగా కాకపోయినా ఎంతోకొంత నిర్మాణ స్వరూపముంది. అదిఅన్ని ప్రాంతాలకి విస్తరించటానికి కావలసిన అనుభవం, క్యాడర్ బిజెపి కి వున్నాయి. ఈ రెండు కలిస్తేనే ముందు భాగం లో మాట్లాడుకున్న కాపు సామాజిక కోర్ బేస్ ధృఢంగా వెన్నంటి వుంటుంది. ఈ ఐక్య కూటమి ని చివరిదాకా తీసుకెళ్ల గలిగితేనే జగన్ కి బలమైన ప్రత్యామ్నాయ మేర్పడుతుంది.

Also Read: సోము వీర్రాజు ఎంపికలో సామాజిక కోణం

ఈ పై అంశాలను స్థూలంగా ముందుకు తీసికెళ్ళ గలిగితే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రత్యామ్నాయ కూటమిగా ముందుకు వస్తుంది. అధికారం లోకి వచ్చే అవకాశం కూడా మెండుగా వుంది. ఈ రోజుకి జగన్ కి తిరుగు లేదని అనిపించినా రాజకీయాల్లో నాలుగు సంవత్సరాలు దీర్ఘకాలమే. రాజకీయాల్లో ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉంటాయని గ్యారంటీ లేదు. పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. సోము వీర్రాజు- పవన్ కళ్యాణ్ ల నాయకత్వం సరైన ప్రత్యామ్నాయాన్ని ఆంధ్రా లో నిర్మిస్తారని ఆశిద్దాం.