Exit Poll 2024: దేశంలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎగ్జిట్ పోల్స్ ఎలా చేపడుతారు? వీటికి ఉండే ప్రామాణికత ఏంటి? పైపై లెక్కలు చూసి వేస్తారా? లోతుగా విశ్లేషణ చేస్తారా? అసలు ఎలా ఎగ్జిట్ పోల్స్ రూపొందిస్తారు?వీటికి ఉన్న చరిత్ర ఏంటి? మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో.. బలమైన చర్చ నడుస్తోంది. అసలు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు నుంచి ప్రారంభమయ్యాయి అన్నది ఎక్కువమంది ఆరా తీసే పనిలో పడ్డారు.
సాధారణంగా ప్రముఖ మీడియా సంస్థలు సర్వే ఏజెన్సీలతో భాగస్వామ్యం అవుతాయి. ఎగ్జిట్ పోల్స్ ను తయారు చేస్తాయి. అప్పుడే ఓటు వేసి వచ్చేవారికి పలకరిస్తారు. ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది తెలుసుకుంటారు. మరికొందరినీ ఫోన్లో పలకరిస్తారు. వివరాలు సేకరిస్తారు. ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని ఇలా శాంపిళ్లను సేకరిస్తారు. వాటిపై లోతుగా విశ్లేషిస్తారు. అప్పుడే ఒక నిర్ణయానికి వస్తారు.అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ప్రాథమికంగా నిర్ధారిస్తారు.సామాజిక వర్గాలు,మహిళలు, పురుషులు, యువత ఇలా అనేక రకాల అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు.
అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇండియాలో ఇప్పుడే ప్రారంభం కాలేదు. రెండో సార్వత్రిక ఎన్నికలు 1957లో జరిగాయి. అప్పటి నుంచే ఎగ్జిట్ పోల్స్ హవా ప్రారంభం అయింది. తొలిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. అయితే స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను అంచనా వేసే ప్రయత్నాలు చేసింది. 1937 యునైటెడ్ ప్రొవెన్సియల్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ ఓ చిత్రమైన ప్రయోగం చేసింది.తమకు ఓటు వేసే ప్రతి ఒక్కరూ చిన్న కర్ర తీసుకొని రావాలని కోరింది. తమకు ఓటు వేసిన వారు ఆ కర్రను పోలింగ్ స్టేషన్ దగ్గర్లోని ఓ చోట గుట్టగా వేయమంది. ఓటింగ్ పూర్తయ్యాక ఆ కర్రలన్నింటినీ లెక్కించి.. తమకు ఎన్ని ఓట్లు పడ్డాయో అంచనాకు వచ్చేవారు. తరువాత విజయానికి చిహ్నంగా కర్రలగొట్టను కాల్చి సంబరాలు చేసుకునేవారు. అయితే అక్కడి నుంచి ప్రతి ఎన్నికకు.. కొత్త పుంతలు తొక్కుకుంది. సర్వేలు, ఫ్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ సరికొత్తగా రావడం ప్రారంభించాయి. ఎన్నికల ప్రక్రియలోనే కీలకంగా మారాయి.