Lok Sabha Election 2024: ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత ఎంత?

ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి నియమ నిబంధనలు ఉన్నాయి. ఓటర్ల పై ప్రభావం పడకుండా ఉండడం కోసం.. పోలింగ్ చివరి రోజు ఓటింగ్ సమయం పూర్తయ్యాకే ఎగ్జిట్ పోల్చిన విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది.

Written By: Dharma, Updated On : June 1, 2024 12:24 pm

Lok Sabha Election 2024

Follow us on

Lok Sabha Election 2024: తినబోతూ రుచి అడుగుతున్నట్టు.. ఎన్నికల ఫలితాలకు ముందు ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈరోజు తుది పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ బోతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. బిజెపికి అధికంగా సీట్లు వస్తాయా? ఎన్డీఏ అధికారంలోకి వస్తుందా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? ఏపీ ప్రజల మొగ్గు ఎటు? ఇలా అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం దొరకకున్నా.. ఒక ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వనున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత ఎంత? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో దారుణంగా అంచనాలు తప్పినా.. ఎగ్జిట్ పోల్స్ పై మాత్రం ప్రజల్లో ఆసక్తి తగ్గలేదు.

ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి నియమ నిబంధనలు ఉన్నాయి. ఓటర్ల పై ప్రభావం పడకుండా ఉండడం కోసం.. పోలింగ్ చివరి రోజు ఓటింగ్ సమయం పూర్తయ్యాకే ఎగ్జిట్ పోల్చిన విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది. ఓటు వేసిన వారి నుంచి అభిప్రాయాలను సేకరించి.. పూర్తిస్థాయి విశ్లేషించి ఎగ్జిట్ పోల్స్ ను రూపొందిస్తారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కచ్చితంగా అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంది. సర్వే చేసే సంస్థ ప్రామాణికత, అది ఎవరి కోసం పని చేస్తుందనేది తొలుత గమనించాలి. ఎంతమందితో సర్వే చేస్తున్నారనేది కీలకం. సాధారణంగా ఓటు వేసి వచ్చిన తర్వాత వాటర్లను నేరుగా, లేకుంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాచారం సేకరిస్తారు. దానిపై కూడా లోతుగా విశ్లేషించి.. ఆ పార్టీలకు వచ్చే ఓట్ల శాతాన్ని అంచనా వేస్తారు.

అయితే ఇంతకుముందు చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. రివర్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2004 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. 8 నెలల పదవీకాలం ఉండగానే వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 330 సీట్లు వస్తాయని పేరు మోసిన మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. కానీ ఎన్డీఏ కూటమి కేవలం 181 స్థానాలకి పరిమితం అయింది. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. జెడియు, ఆర్జెడి పొత్తుతో ముందుకెళ్లగా.. బిజెపి కూటమితో ముందుకు సాగింది. అయితే ఎగ్జిట్ పోల్స్ బిజెపి కూటమి వైపే మొగ్గు చూపాయి. కానీ జేడీయు ఆర్ జె డి కి సంయుక్తంగా 178 సీట్లు వచ్చాయి. బిజెపి కూటమి 58 సీట్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. హంగ్ వస్తుందని అంచనా వేయగా.. బిజెపి 202 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పాలన పగ్గాలు చేపట్టింది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు అమ్ ఆద్మీ పార్టీకే పట్టం కట్టాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ 77 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఆర్ జె డి కి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయి. కానీ వాస్తవ ఫలితాలు వచ్చేసరికి బిజెపి, జెడియు కూటమికి వచ్చాయి. ఆ రెండు పార్టీలు సంయుక్తంగా అధికారాన్ని చేపట్టాయి. అయితే అదే సమయంలోఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఫలించిన సందర్భాలు కూడా ఉన్నాయి.