Etela: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ గెలుపుతో టీఆర్ఎస్ కొంత బలాన్ని కోల్పొయింది. ఇక జిల్లా వ్యాప్తంగా బీజేపీని బలపర్చేందుకు ఈటెల రాజేందర్ మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. దాని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారని తెలుస్తోంది. ఈటలపై అవినీతి ఆరోపణలు వచ్చిన నాటి నుంచి ఎన్నికల్లో గెలుపొందే వరకు టీఆర్ఎస్ నాయకులు ఆయనపై చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకొని వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఈటెల రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా పడనుందని తెలుస్తోంది.

ఇన్‌ఛార్జీలుగా వచ్చిన వారిపై ఫొకస్..
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ తరుఫున ఇన్‌ఛార్జీలుగా వచ్చిన వారిని వదిలిపెట్టబోనని ఈటెల రాజేందర్ పలు మార్లు బహిరంగంగానే చెప్పారు. అలాగే తనకు అండగా నిలబడిన వారి రుణం తీర్చుకుంటాను అని కూడా చెప్పారు. ఇన్‌ఛార్జీలుగా వచ్చిన వారిలో ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈటెల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చిన సమయం నుంచి మంత్రి గంగుల కమలాకర్ ఆయనపై విరుచుకుపడ్డారు. గతంలో జరిగిన సంగతులన్నీ ఏకరువు పెట్టారు. ఈటెలపై ఆరోపణలు చేశారు. అయితే మొదట అక్కడ నుంచే నరుక్కుంటూ రావాలని ఆయన చూస్తున్నట్టు సమాచారం. అక్కడ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చూస్తున్నారు.
మొదటి నుంచి ఈటెలతో సన్నిహతంగా ఉన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే భొడిగె శోభను చొప్పదండి నుంచి బీజేపీ పార్టీ టికెట్‌పై గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. భొడిగె శోభ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేశారు. 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో ఆమెకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు. టీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్‌కు బీ ఫామ్ అందించారు. దీంతో ఆమె బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఆమె ఈటెల రాజేందర్ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఆయనకు అండగా నిలబడ్డారు. అలాగే కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కూడా ఈటెల రాజేందర్ కు మద్దతు ప్రకటించారు. హుజూరాబాద్‌లో ఈటెల గెలుపు కోసం కృషి చేశారు. ఆమె టీఆర్ఎస్ నుంచి కరీంగనర్ జడ్పీ చైర్మన్‌గా పని చేశారు. అయితే మరో సారి ఆమెకు అవకాశం ఇవ్వలేదు. 2018 ఎన్నికల సమయంలో కూడా ఆమె వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కానీ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఆయనకే టికెట్ కేటాయించారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆమె బీజేపీలో చేరారు. ఇప్పుడ బీజేపీ నుంచి వేములవాడలో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. ఈ విషయంలో ఈటెల రాజేందర్ దగ్గర కూడా మాట తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక వేళ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ ను వేములవాడ నుంచి బరిలో దింపితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో స్థానంలో తుల ఉమను పోటీ చేయించే అవకాశం ఉంది.
Also Read: MLC Elections: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షమే..
ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీని బలపర్చి తనకు అండగా నిలబడిన వారి రుణం తీర్చుకోవడంతో పాటు తనకు వ్యతిరేకంగా పని చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో ఈటెల ఉన్నట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల తనకు వ్యతిరేకంగా పని చేసిన వారికి కూడా సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బహిరంగంగానే చెప్పారు. అందులో భాగంగానే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా పని చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా అలాగే చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బండి సంజయ్ కుమార్ రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఈటెల రాజేందర్‌కు వదిలిపెట్టి, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ గెలిచే స్థానాలపై మొదటగా ఫోకస్ చేస్తున్నారు. చూద్దాం మరి బీజేపీ నాయకుల ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.