
ఈటల రాజేందర్ ఒకటి అంటే రెండు అనేలా వ్యవహరిస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఆయన విమర్శల నుంచి చేష్టల దాకా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చిత్తు చేస్తోంది.ఇప్పటికే కేసీఆర్ ను విమర్శించిన ఈటలపై ఆయన సహచర మంత్రులైన గంగుల, హరీష్, కొప్పుల లాంటి వారు తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈటల చర్యకు ప్రతిచర్యను టీఆర్ఎస్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా అదే చేసింది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఉదయం గన్ పార్క్ వద్ద నివాళులర్పించి అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఆయన అలా అందించారో లేదో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇలా ఆమోదించడం విశేషం.
ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్ లోనే ఉన్న ఈ రాజీనామా లేఖను ఆమోదించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. దీంతో స్పీకర్ పోచారం వెంటనే సంతకం చేసి ఆమోదించారు.
దీంతో టీఆర్ఎస్ ను వైదొలిగి బీజేపీలో చేరి పోటీచేద్దామని కలలగన్న ఈటల రాజేందర్ కు పోటీగా టీఆర్ఎస్ కూడా గట్టిగానే నిలబడినట్టుగా అర్థమవుతోంది. ఈటల రాజీనామా చేసి టీఆర్ఎస్ ను ఓడిస్తానని శపథం చేశారు.ఈ క్రమంలోనే ఈనెల 14న ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఆయనతోపాటు మాజీ టీఆర్ఎస్ నేతలను తీసుకెళుతున్నారు.
ఈటల దూకుడుకు అంతూ దుందుడుకుగా టీఆర్ఎస్ స్పందించింది. ఆయనతో హుజూరాబాద్ లో ఫైట్ కు రెడీ అయ్యింది. తెలంగాణలో మరో ఉప ఎన్నిక దీంతో అనివార్యమైంది. మరి హుజూరాబాద్ లో గెలుపు ఈటలదా? టీఆర్ఎస్ దా? అన్నది కొన్ని నెలల్లోనే తేలనుంది.