Etela Jamuna
Etela Jamuna: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోల సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి ఒక కీలక అప్ డేట్ వచ్చింది. అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున రెడీ అవుతున్నట్లు తెలిసింది. గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఆదివారంతో గడువు ముగిసింది.
6,003 దరఖాస్తులు..
ఇక బీజేపీ దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 6,003 దరఖాస్తులు రాగా, చివరిరోజు ఆదివారం 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్‌రెడ్డి, సోయం బాపురావు, డీకే.అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో వారంతా లోక్ సభ ఎన్నికల్లోనే పోటీ చేస్తారని స్పష్టమైంది. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మహబూబ్ నగర్ నుంచి దరఖాస్తు చేయగా, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, గజ్వేల్ నుండి ఆయన సతీమణి ఈటల జమున దరఖాస్తు చేసుకున్నారు. కాగా సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
జమునకు టికెట్ ఖాయం..
తెలంగాణ ఎన్నికల వ్యూహరచన కోసం బీజేపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలో ఈటల రాజేందర్ కీలక స్థానంలో ఉన్నందున.. ఆయన సతీమణి ఈటల జమునకు గజ్వేల్ టికెట్ ఖరారు కావడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.
వారసత్వ రాజకీయాలకు..
బీజేపీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా మోదీ ప్రధాని అయ్యాక ఇదే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈటల రాజేందర్ సతీమణి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తనయుడు కూడా బోథ్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇలా చాలా మంది తమ వారుసల కోసం దరఖాస్తులు ఇచ్చారు. వారసత్వ రాజకీయాలు వద్దనే బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.