Oil Palm Cultivation: తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోందని వ్యసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శాసన సభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వొడితెల సతీష్ కుమార్ తదితరులు రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం – తీసుకుంటున్న చర్యలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ముందుచూపుతో ప్రోత్సాహం..
దేశంలో తలసరి వంటనూనెల వినియోగం సాలీనా 19 కిలోలు ఉండగా, దేశంలో సాలీనా 250 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల వినియోగం అవుతుందని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వంటనూనెలు కేవలం 130 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అని పేర్కొన్నారు. మిగిలిన వంటనూనెలు అన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. 1992 నుంచి ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహం మందకొడిగా సాగుతుందని తెలిపారు. వంటనూనెల్లో స్వయంపోషకం కావాలంటే దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు చేయాల్సి ఉందన్నారు. అందుకే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం
1.18 లక్షల ఎకరాల్లో సాగు..
తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 40 వేల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు ఉందన్నారు. ఏడాదిలో 1.18 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టినట్లు తెలిపారు. నూతనంగా 2023 – 24లో 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకోసం రూ.750 కోట్లు కేటాయించామని వివరించారు.
రైతులకు సబ్సిడీ..
ఎకరాకు రూ.50,918 చొప్పున ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ మెటీరియల్, ఇంటర్ క్రాప్ – ఇన్‌ఫుట్స్, బిందు సేద్యం కోసం ఈ సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఒక రైతుకు 12.5 ఎకరాల వరకే సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం పరిమితి విధించిందన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆ పరిమితి సవరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 38 ఆయిల్‌పామ్ నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కల్లూరుగూడెం వద్ద మాత్రమే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ, రిఫైనరీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలో ఫ్యాక్టరీల నిర్మాణానికి భూమి కేటాయించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు జిల్లాల్లో ప్రభుత్వ స్థలం ఇస్తామన్నారు. ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ ఆధారంగా ఆయిల్ పామ్ ధర నిర్ణయించడం మూలంగా పామాయిల్ గెలలకు టన్నుకు రూ.17 వేల పై చిలుకు ధర పలుకుతుందని తెలిపారు.