జగన్ ప్రభుత్వంపై రమేష్ కుమార్ ఎదురు దాడి

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించడం వల్లనే తనను తొలగించిని ఆరోపిస్తూ మాజీ ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ తనను పదవి నుండి తొలిగించిన 24 గంటల లోపుగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు. తన పదవీకాలాన్ని కుదిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని, దురుద్దేశంతోనే తనను తొలగించిందని శనివారం సాయంత్రం హై కోర్ట్ లో వేసిన అత్యవసర పిటిషన్ లో ధ్వజమెత్తారు. కరోనా […]

Written By: Neelambaram, Updated On : April 12, 2020 11:57 am
Follow us on


రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించడం వల్లనే తనను తొలగించిని ఆరోపిస్తూ మాజీ ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ తనను పదవి నుండి తొలిగించిన 24 గంటల లోపుగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు.

తన పదవీకాలాన్ని కుదిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని, దురుద్దేశంతోనే తనను తొలగించిందని శనివారం సాయంత్రం హై కోర్ట్ లో వేసిన అత్యవసర పిటిషన్ లో ధ్వజమెత్తారు.

కరోనా వైరస్‌ వ్యాపించే పెను ముప్పు పొంచి ఉన్నందున స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం కారణంగానే ఏపీ ప్రభుత్వం తనను టార్గెట్‌ చేసిందని హైకోర్టుకు తెలిపారు.

ఎన్నికలు వాయిదా వేయకుంటే రాష్ట్రం కరోనా వైర్‌సకు హాట్‌స్పాట్‌గా మారి ఉండేదని, తద్వారా దారుణ పరిణామాలకు కేంద్ర బిందువయ్యేదని ఈ సందర్భంగా తన చర్యను సమర్ధించుకొంటూ ఆయన హైకోర్టు కు స్పష్టం చేశారు.

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం వల్లే తనను తొలగించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన హైకోర్టు కు తెలిపారు. కరోనా కారణంగా ప్రజలంతా తమ మనుగడ కోసం అల్లాడుతున్న సమయంలో ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకు ఒడిగట్టిందని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని కుదిస్తూ చట్టవిరుద్ధంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు సర్వీసు నిబంధనలను మారుస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్ధించారు.

ఎస్‌ఈసీ పదవీ కాలం కుదించడం, తనను తొలగించడం, కొత్త ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన 617, 618, 619 జీవోలు చట్ట, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఇప్పుడు ఈ విషయమై ఆర్డినెన్సు జారే చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనే ప్రశ్నను రమేష్ కుమార్ లేవదీశారు. ఆర్డినెన్స్‌ను అత్యవసర సమయాల్లో మాత్రమే జారీ చేయాలని రాజ్యాంగం చెబుతోందని, అలాంటి పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

దేశ వ్యాప్తంగా వైద్య పరమైన అత్యవసర స్థితి నెలకొని ఉండగా, తన తొలగింపునకు సంబంధించి హడావుడిగా ఆర్డినెన్స్‌ తీసుకురావడాన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం గ్రహించవచ్చునని కోర్టుకు తెలిపారు.

తనను ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తప్పించాలన్న లక్ష్యంతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని స్పష్టం చేసారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ తేవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకురావడం సరి కాదని కోర్టుకు తెలిపారు.

ఆర్డినెన్స్‌ ఎల్లప్పుడూ న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని గుర్తు చేస్తూ అధికార దుర్వినియోగంతో ఆర్డినెన్స్‌లను జారీ చేస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సూచించారు.

ఎన్నికల కమిషన్‌ తొలగింపు ప్రక్రియకు రాజ్యాంగంలో నిర్దేశిత విధానం ఉందని, దాని నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుందని వివరించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని హైకోర్టుకు తెలిపారు.