EC- KCR BRS: కేసీఆర్ ఎన్నో ఆశలతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదులా మారింది. నిన్న కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానించారు. ఈ మేరకు తీర్మానం కాపీతో ఢిల్లీ వెళ్లిన టీఆర్ఎస్ బృందానికి ఈసీ షాకిచ్చింది. బీఆర్ఎస్ కు పోలికగా మరో మూడు పార్టీలు ఈసీ వద్ద పరిశీలనలో ఉన్నాయని ఈసీ అధికారులు తెలిపినట్టు సమాచారం. ఈసీ వద్ద రిజిస్ట్రర్ అయ్యి గుర్తింపు పొందని మూడు పార్టీలు ఉన్నాయని తెలిపింది

సికింద్రాబాద్ నుంచి ‘బహుజన్ రాష్ట్ర సమితి’, ముంబై నుంచి బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ, జైపూర్ నుంచి భారత్ రాష్ట్ర సమానతవాద పార్టీలు ఈసీ వద్ద రిజిస్ట్రర్ అయ్యి ఉన్నాయని.. గుర్తింపు పొందలేదని.. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు ఈసీ వర్గాలు ఒప్పుకోనట్టు సమాచారం.
Also Read: Revanth Reddy: కేసీఆర్ బీఆర్ఎస్ పై అదిరిపోయే పంచ్ వేసిన రేవంత్ రెడ్డి
నిన్న టీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా కమిటీలు సంయుక్తంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చిన కాపీ.. ఇక అధ్యక్షుడిగా కేసీఆర్ రాసిన లేఖను జతచేసి పేరు మార్చాలని ఈసీకి టీఆర్ఎస్ బృందంలో వెళ్లిన ఆ పార్టీ సీనియర్ నేత బి.వినోద్ కుమార్ విన్నవిస్తూ లేఖను ఇచ్చింది. పేరు మార్పు తీర్మానాన్ని పరిశీలించి ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరింది.
అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో మూడు పార్టీలు రిజిస్ట్రర్ అయ్యాయని.. దీనిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపినట్టు సమాచారం. దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో తాము ‘టీఆర్ఎస్ ’ పేరు మీద.. కారు గుర్తుపై పోటీచేస్తామని ఈసీకి టీఆర్ఎస్ నేతలు తెలిపారు.

ఈనెల 14వ తేదీలోపున టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చితే కొత్త పార్టీ పేరుమీదనే పోటీచేస్తామని.. లేదంటే టీఆర్ఎస్ పేరుపైనే చేస్తామని తెలిపారు. ఇక గుర్తు కారునే ఈసీ ఇస్తుందా? లేదా? అన్నది ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు చిక్కుమడిగా మారింది. ఇదివరకే మూడు పార్టీలు పోలి ఉండడంతో ఈసీ వర్గాలు ఆమోదిస్తాయా? లేదా? ఇందులో కేంద్రంలోని బీజేపీ వేలు పెట్టి ఏదైనా దెబ్బ తీస్తుందా? అన్న ఉత్కంఠ టీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read:KCR Chandrababu: హాట్ రియాక్షన్: కేసీఆర్ జాతీయ పార్టీపై ఓ నవ్వు నవ్వి ఊరుకున్న చంద్రబాబు