Jagan vs Eenadu: ఏపీకి సీఎం కాగానే జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ పడకేసింది. అంతకు ముందు వరకు తప్పనిసరిగా ఆయన కోర్టు విచారణలకు హాజరయ్యేవారు. ఏ క్షణం సీఎం అయ్యారో.. కేసుల్లో ఎక్కడలేని మినహాయింపులు లభించాయి. ఎప్పుడో దశాబ్ద కాలం కిందట నమోదైన ఈ కేసులు విషయం కొత్త తరానికి తెలియడం లేదు. దీంతో ఆయన ఒక గొప్ప నాయకుడిగా భావించి.. భావితరం సైతం మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోంది. చట్టంలో ఉన్న లొసుగులను, నిబంధనలను సాకుగా చూపి జగన్ తప్పించుకుంటున్నారు. అయితే ప్రజలకు గుర్తు చేయడంతో పాటు కొత్త తరానికి జగన్ అక్రమార్జన గురించి తెలియజెప్పే బాధ్యతను ఈనాడు తీసుకోవడం విశేషం.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు అన్నది జగన్ పై ఉన్న నేరారోపణ. సమగ్ర దర్యాప్తు చేసిన సిబిఐ.. జగన్ ను ఏకంగా 16 నెలల పాటు జైల్లో ఉంచింది. జైలులో జ్ఞానోదయం అయ్యిందో.. రాజకీయాలు అవపోషణ పట్టుకున్నారో తెలియదు కానీ.. జగన్ రాజకీయాల్లో ఆరితేరిపోయారు. అద్భుత విజయాన్ని అందుకొని ఏపీ పీఠంపై కూర్చున్నారు. చట్టంలో ఉన్న లొసుగులు, చాన్సులను దక్కించుకొని కేసుల నుంచి, కేసుల విచారణ నుంచి మినహాయింపు దక్కించుకున్నారు. అయితే ఎంత ప్రమాదకర క్రీడ ఆడుతున్నారో.. కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేస్తోంది ఈనాడు. నిత్యం ఈ కేసులను వాచ్ చేస్తూ సమగ్ర కథనాలను అందిస్తోంది.
జగన్ పై నమోదైన కేసులు పుష్కరకాలం దాటి.. రెండేళ్లు అయ్యింది. దశాబ్ద కాలం దాటడంతో ఓ తరం జగన్ అవినీతిని గ్రహించలేకపోతోంది. తండ్రి సీఎంగా ఉన్నప్పుడే అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు.. అదే సీఎం పీఠంపై తాను కూర్చున్నాక దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో గుర్తు చేసుకోవాలని రామోజీరావు నవతరానికి హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లిన పాలనలో ప్రజలు ఎలా? ఏ స్థాయిలో? నిలువు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందో సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు కథనాలు సైతం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.
అయితే ఈనాడు ద్వారా తనకు జరగబోయే నష్టాన్ని జగన్ ఏనాడో గుర్తించారు. దాదాపు ప్రతి సభలో ఈనాడు ను నమ్మవద్దని ప్రజలను నేరుగా కోరుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గుక్క పెట్టి ఏడుస్తున్నారు. అయితే అందులో వస్తున్న కథనాలు నిజం కాదని చెప్పే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారు. కానీ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ అని ఒక శీర్షిక నడుపుతున్నారు. దానినే తన సాక్షి మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకో గమ్మత్తయిన కథనంతో.. దోపిడీని గణాంకాలతో సహా ఈనాడు వెల్లడించేసరికి జగన్ శిబిరంలో ఒక రకమైన కలవరపాటు కనిపిస్తోంది. తమను ఎల్లో మీడియా నిత్యం వాచ్ చేస్తుందని భయపడడం వైసిపి నేతల వంతువుతోంది.