PM Modi- Eenadu MD Kiran: తన ప్రయోజనాల కోసం రామోజీరావు ఎందాకైనా వెళ్తాడు. తనకు అడ్డొస్తే మాత్రం ఎవరినైనా క్షమించడు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పై రాసిన రాతలు ఇప్పటికీ చాలా మందికి గుర్తే. ఇప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ అవసరం కనుక కీర్తిస్తూ రాస్తూ ఉంటాడు. అక్కడిదాకా ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ పై విచారణ జరుగుతున్నప్పుడు చంద్రబాబు క్యాంపు పత్రికలు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాయో చూశాం కదా? 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు రామోజీరావు జగన్ పై రాయి వేయలేదు. రాయి విసరనివ్వలేదు. రామోజీరావు పెద్ద కోడలు, జగన్ భార్య భారతి ఇద్దరు మంచి స్నేహితులు కావడం కూడా ఇందుకు కారణమేమో. సరే ఇన్నాళ్లు స్తబ్దు గా ఉన్న రామోజీ.. కొద్ది రోజుల నుంచి జగన్ పై మళ్లీ పెన్ను ఎక్కు పెట్టాడు. ఈనాడులో వార్త రావడం, మరుసటి రోజు సాక్షిలో దానికి కౌంటర్ వార్త ప్రచురించడం ఇలా సాగిపోతోంది. మధ్యలో ఆంధ్రజ్యోతి సరే సరి. వాస్తవానికి ఈనాడు ను విమర్శించేందుకు బోలెడు అంశాలు మనకు దొరుకుతూ ఉంటాయి. రోజుకు పతనమవుతున్న విలువలు, కరోనా సమయంలో ముస్లిం యువకుడికి రవిగా పేరు మార్చి వార్త రాయడం దానికే చెల్లుతుంది. దీనికి తోడు ప్రొఫెషనల్ ప్రమాణాలు, నాన్ ప్రొఫెషనల్ ప్రమాణాలు ఎప్పుడో మట్టి కొట్టుకుపోయాయి. కానీ కొన్ని ప్రొఫెషనల్ టాస్క్ లను మాత్రం ఈనాడు పత్రికే చేయగలదు. ఈనాడు మాత్రమే ప్రచురించగలదు. జీవవైవిధ్య సదస్సు జరిగినప్పుడు ఈనాడు ప్రచురించిన కథనాలను వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు మెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ఏదైనా ప్రత్యేక దినోత్సవం సందర్భంగా లేదా ఉత్సవాల సందర్భంగా ఈనాడు ప్రచురించే కథనాలు మామూలుగా ఉండవు. కోవిడ్ లాంటి పీడ దినాల్లో సైతం మేడారం జాతరపై ఈనాడు ఇచ్చిన కవరేజ్ న భూతో న భవిష్యత్. ఈ విషయంలో ఈనాడును చూసి వాతలు పెట్టుకునే ఆంధ్రజ్యోతికి చేతకాదు. సాక్షికి అస్సలు చేతకాదు. ఇక అలాంటి టాస్కులు చేయడంలో మిగతా పత్రికలు ఆమడ దూరంలో ఉంటాయి.

ఇప్పుడే ఈ చర్చ ఎందుకంటే
75 ఏళ్ల స్వాతంత్ర వేడుకల్ని దేశం ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరిట ఘనంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ఇదేదో బిజెపి కార్యక్రమమనో, ప్రభుత్వ కార్యక్రమమనో తీసి పారేయకుండా.. ఇది మనందరి కార్యక్రమం అనే భావనతో ఈనాడు ప్రతిరోజు మరపురాని స్వాతంత్ర ఘట్టం మీద ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అది కూడా నిరంతరాయంగా, వరుసగా.. ఎన్ని ప్రకటనలు వచ్చినా తన స్వాతంత్ర్య వార్తల యజ్ఞాన్ని మాత్రం ఆపలేదు. వాస్తవానికి ఆ కథనాలన్నీ ఎప్పుడూ చదివినవి కావు. కొత్త కొత్తవి. చరిత్ర గతిలో ఎక్కడో మరుగున పడినవి వెతికి మరీ ప్రచురించింది.. నిజంగా ఇది అభినందనీయమైన ప్రయాస. ఇందులో మెచ్చుకో తగినంత శ్రమ ఏముందని వెక్కిరింపుగా అవే వాళ్ళ అజ్ఞానాన్ని అలా వదిలేస్తే.. మరి ఆ ప్రయత్నాన్ని ఈనాడు సింపుల్ గా అలా ముగించదు కదా,! అలా ముగిస్తే అది ఈనాడు ఎందుకు అవుతుంది. అందుకే ఆ కథనాల సంకలనాలను ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఇమ్మోర్టల్ సాగా/ అమృత గాథ పేరిట సంకలనంగా అచ్చేసింది. నేరుగా ప్రధానమంత్రి వద్దకు ఈనాడు ఎండి కిరణ్, కార్యదర్శి ఎండి శైలజ, రామోజీ ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి వెళ్లి మోదీని కలిశారు. ఆయనతో ఆ పుస్తకాలను ఆవిష్కరించారు.
మోడీ ఎంత బిజీగా ఉన్నా.. ఈనాడు అడగగానే సమయం ఇవ్వడా ఏం? ఆ పుస్తకాలను ఆవిష్కరించాడు. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడాడు. తనకున్న స్నేహబంధాన్ని తలుచుకున్నాడు. ఈనాడు ప్రయత్నాన్ని మెచ్చుకున్నాడు. ఒకవేళ ఇలాంటి ప్రొఫెషనల్ ప్రయత్నాన్ని సాక్షిగా చేసి ఉంటే.. జగన్, భారతీ వెళ్లి మోడీతో ఆవిష్కరింపజేసేవారు. ఇలాంటి కార్యక్రమానికి మోడీ టైం ఇవ్వడని కాదు. సాక్షికి అంత సీన్ లేదని.. ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అదే ఒకవేళ చంద్రబాబు గనుక వస్తున్నా మీకోసం పాదయాత్ర పార్ట్ 2 స్టార్ట్ చేస్తే.. క్రమం తప్పకుండా, రోజూ మెయిన్ రెండో పేజీలో వార్తలు అచ్చేసేది. వారం వారం కొత్త పలుకు సరే సరి. వాస్తవానికి ఇలాంటి భేటీల్లో రామోజీ రావే తెరమీద కనిపిస్తాడు. కిరణ్, శైలజ, విజయేశ్వరి పాల్గొనడం అత్యంత అరుదు. మరి ఢిల్లీ వెళ్లేందుకు రామోజీరావు ఆరోగ్యం సహకరించడం లేదా? లేక ఇటీవల ఆప్త మిత్రుడిని కోల్పోయాననే బాధలో ఉన్నాడా? సందర్భం ఏదైనా సరే గెస్టులు ఎవరైనా తన వద్దకే రావాలని కోరుకునే రకం రామోజీరావు. మొన్నటికి మొన్న అమిత్ షా నేరుగా ఫిలిం సిటీకే వెళ్ళాడు. రామోజీరావు ఆశీర్వాదాలు తీసుకున్నాడు. రామోజీరావు తన సుదీర్ఘ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడిని కలిసింది బహుశా కేసీఆర్ ని మాత్రమే కావచ్చు.
విజయ సాయి రెడ్డి కి వార్నింగ్ ఇస్తున్నారా
ఈ పుస్తకాల సంగతి పక్కన పెడితే ఈమధ్య విజయసాయిరెడ్డి ఈనాడు మీద నిప్పులు కక్కుతున్నాడు. ఈనాడు కూడా మూడేళ్లపాటు దాచుకున్న తన రాళ్లను జగన్ పై విసురుతోంది. ధర్మాన ప్రసాదరావు, విజయ సాయి రెడ్డి వంటి నేతలపై విరుచుకుపడుతోంది. ఈ సమయంలో చంద్రబాబు నా ప్రత్యర్థి కాదు ఈనాడు మాత్రమే అని జగన్ కూడా అంటున్నాడు. ఈ స్థితిలో ప్రధాని మోదీ తో రామోజీ కుటుంబ సభ్యులు భేటీ అయి విజయ సాయి రెడ్డికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
ఈనాడు, నరేంద్ర మోడీ స్థాయిలో ఏదైనా జరిగినా అంత చిన్నగా చూడలేం.

ప్రతి భేటీ వెనుక ఏదో విషయం దాగే ఉంటుంది. ఏవో మార్మికమైన ఉద్దేశాలు కనిపిస్తూనే ఉంటాయి. ఎదుటి వాళ్లకు ఏదో సంకేతాలు వెళ్తూనే ఉంటాయి. ప్రస్తుతం రామోజీ పరిస్థితి అంత బాగోలేదు. ఈనాడు క్రమంగా తన విలువను కోల్పోతోంది. ఈటీవీ భారత్ ఒక విఫల ప్రయోగంగా మీడియా చరిత్రలో నిలిచిపోబోతోంది. దీనికి తోడు ఈటీవీ తన ప్రభను మెల్లగా కోల్పోతుంది. మార్గదర్శి ఫైనాన్స్ కేసులో విచారణ వేగం పెరగబోతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ వస్త్రాలు విసురుతున్నాడు. విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కేసులో ఇన్ ప్లీడ్ అయ్యాడు. మరి జగన్ నుంచి కాచుకొనేందుకే రామోజీ కుటుంబం మోదీని కలిసిందా? మోడీ ఏమైనా బలమైన హామీ ఇచ్చాడా? విజయసాయి రెడ్డికి ఏమైనా హెచ్చరికలు వెళ్లాయా? బుర్ర తొలిచే ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానం కిరణ్ కుటుంబం చెప్పదు. మోదీ చెప్పలేడు. కొన్ని భేటీలు అంతే.. అలా అవసరాల కొద్దీ సాగిపోతూ ఉంటాయి.