Jagan Vs TDP: చంద్రబాబు అరెస్ట్ షాక్ నుంచి తెలుగుదేశం పార్టీ కోలుకుంటోంది. ఆవేదనతో కూర్చుంటే పార్టీ ముందుకు నడవదని నాయకులు గుర్తించారు. అందుకే కదనరంగంలోకి దూకారు. జగన్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ స్థైర్యం పై దెబ్బ కొట్టామని వైసిపి భావిస్తుండగా.. తెలుగుదేశం పార్టీ మాత్రం చంద్రబాబు అరెస్ట్ తర్వాత యాక్టివ్ అయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి ఎండగట్టడం ప్రారంభించారు. ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీని నడిపించేందుకు చంద్రబాబు ఓ యాక్షన్ టీం ను రూపొందించారు. యనమల రామకృష్ణుడు, అచ్చెనాయుడు, బాలకృష్ణ, లోకేష్ లతో పాటు 14 మందికి ఈ కమిటీలో చోటు కల్పించారు. ఈ హై పవర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రస్తుతం రంగంలోకి దిగింది.
తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పేట దాడికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే నినాదంతో జనం వద్దకు వెళుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరినీ కలుపుకెళ్లాలని టిడిపి ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా టిడిపి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ అవినీతిపై ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యింది. ఆ పార్టీ ముఖ్యులు గణాంకాలతో సహా వైసీపీ సర్కార్ అవినీతిని.. సీఎం జగన్ అక్రమార్జనను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదనతో పాటు సీఎం అయిన తర్వాత వ్యవస్థలను నాశనం చేసి అక్రమంగా ఆర్జించారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యేకంగా మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి టిడిపి నేత నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మరోవైపు ఎల్లో మీడియా స్ట్రాటజీ మార్చింది. చంద్రబాబు అరెస్ట్ అయి 18 రోజులు కావడంతో జైలు, బెయిల్ విషయాన్ని పక్కన పెట్టి సీఎం జగన్ అక్రమ సంపాదన పై ఫోకస్ చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో పాటు టిడిపి అనుకూల మీడియా అంతా జగన్ అవినీతిపైనే దృష్టి సారించాయి. అవినీతి అనకొండ జగన్ అని.. దేశంలో కల్లా అవినీతిలో జగన్ టాప్లో ఉంటారని.. 20 ఏళ్ల క్రితం ఆయన ఆస్తి రూ. 1.74 కోట్లు కాగా.. ప్రస్తుత ఆయన ఆస్తులు విలువ రూ. 3.30 లక్షల కోట్లు అని వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయనపై 38 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటివరకు కోర్టుల్లో 178 స్టేలు తెచ్చుకున్నారని గుర్తుచేస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రసారం చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీతో పాటు ఎల్లో మీడియా నుంచి ఎదురుదాడి ప్రారంభం కావడంతో వైసిపి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నైరాస్యంలోకి వెళ్లిపోతాయని వైసీపీ భావించింది. కానీ అనూహ్యంగా టిడిపి శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. అటు తటస్తులు, విద్యాధికులు సైతం జగన్ చర్యలను తప్పుపడుతున్నారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నారు. అటు దేశ విదేశాల నుంచి సైతం మద్దతు పెరుగుతుండడంతో వైసీపీ నేతల్లో ఆందోళన ప్రారంభమైంది. చంద్రబాబు చరిష్మను కేసులతో పెంచేశారని.. విపక్షాల మధ్య ఐక్యతకు కారణమయ్యారని జగన్ పై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చేజేతులా అస్త్రాన్ని ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. దీనికి మూల్యం తప్పదని భావిస్తున్నారు.