Police Protection For Farmer: అమరావతి వద్దన్నారు.. మూడు రాజధానులే ముద్దు అన్నారు. పాలనా వికేంద్రీకరణ కోసమే ఈ నిర్ణయం అని చెప్పుకొచ్చారు. నాలుగున్నర ఏళ్లవుతున్నా మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయలేకపోయారు. అమరావతిని అచేతనం చేశారు.రైతుల త్యాగాలను ఎగతాళి చేశారు. వారిపై కులముద్రవేశారు. ఉక్కు పాదం మోపారు.వారి ప్రజాస్వామ్య పోరాటాన్ని అడ్డగించారు. అసలు వారు ఈ రాష్ట్ర పౌరులే కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారిని సంఘవిద్రోహ శక్తులుగా.. ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరించి అడుగడుగునా వారి హక్కులను కాలరాస్తున్నారు.
విజయదశమి నుంచి.. విశాఖ నుంచి పాలన అంటూ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటే జగన్ లో ఓ రకమైన భయం వ్యక్తం అవుతోంది. అటువంటి ఘటనే ఒకటి సోమవారం వెలుగు చూసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం దీక్షా శిబిరం మీదుగా సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తోంది. ఆ సమయంలో దీక్ష శిబిరం వద్ద ఏడుపదుల వయసున్న ఓ వృద్ధుడు ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఎదురుగా 50 మంది పోలీసులు నిలబడ్డారు. సీఎం జగన్ కాన్వాయ్ కి రక్షణగా నిలిచారు. చేతి కర్ర సహాయం లేనిదే సరిగ్గా నిలవలేని.. నడవలేని వృద్ధుడు ఆయన. అటువంటి ఆయన నుంచి సీఎం జగన్ రక్షణకు పరితపించిన ఆ 50 మంది పోలీస్ సిబ్బంది ఇప్పుడు హైలైట్ గా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. ఆయనేమీ తీవ్రవాది కాదు.. కండలు తిరిగిన వీరుడు కాదు.. రక్తం మరిగిపోతూ ఏదైనా చేసేద్దాం అనే యువకుడు కాదు. అయినా మీరు చేస్తున్నది ఏంటి అంటూ నెటిజన్లు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ చర్యలు ఇలా మారిపోయాయంటూ ఎక్కువమంది ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే రాజధాని అమరావతి రైతులు మాత్రం ఇది మాకు షరా మామూలే అని చెబుతున్నారు. సీఎం జగన్ ప్రతిరోజు ఈ దీక్షా శిబిరం దాటి వెళ్తుంటారని.. పెద్ద పెద్ద పోలీస్ అధికారులు దీక్ష వద్ద జగన్ కు రక్షణ కల్పిస్తుంటారని.. ఇది మాకు చిన్న విషయం అని తేల్చేస్తున్నారు. గత మూడేళ్లుగా తమకు ఈ అడుగడుగునా ఉక్కు పాదం తప్పలేదని.. మాకు పోలీస్ చర్యలు అలవాటుగా మారిపోయాయని అమరావతి రైతులు చెబుతున్నారు. తమ ధర్మ పోరాటానికి తప్పకుండా అనుకూల ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.